ప్రభుత్వ చర్యలతో మారిన రూపురేఖలు
మౌలిక వసతులు,పారిశుధ్యంపై దృష్టి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
బూడిదపాడులో పర్యటన
పెబ్బేరు రూరల్, ఆగస్టు22: పల్లెప్రగతితో ప్రతి గ్రామంలో అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెబ్బేరు మండలం బూడిదపాడులో పల్లెనిద్ర అనంతరం ఆదివారం ఉదయం ఆయన గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ముందు ఆ తర్వాత గమనిస్తే గ్రామాల రూపురేఖలు ఎంతగా మారిపోయాయో తెలిసిపోతుందన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులతోపాటు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నట్లు తెలిపారు. బూడిదపాడులోని రహదారులను, ఎస్సీలు, బీసీల ఇండ్లను ఆయన పరిశీలించారు. సీసీ రోడ్లకు రూ.20లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షలు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఆయన హామీ ఇచ్చారు. దళితవాడలో పాత ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్ల నిర్మాణానికి సర్వే చేయించి మంజూరుకు కృషి చేస్తానన్నారు. అలాగే, బోదకాలు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న గొల్లబాలయ్యకు తనవంతు సాయంగా రూ. 50 వేల నగదును అందజేసి, వైద్య చికిత్సకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు.
రాఖీలు కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు
పెబ్బేరు ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, మార్కెట్ చైర్పర్సన్ శ్యామల మంత్రి నిరంజన్‌రెడ్డికి రాఖీలు కట్టి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు భాగ్యమ్మ, నాయకులు పెద్దింటి వెంకటేశ్, కురుమూర్తి, జగన్నాథం, వనం రాములు, కర్రెస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యారెడ్డి, కోళ్ల వెంకటేశ్, హర్షవర్ధన్‌రెడ్డి, మేకల ఎల్లయ్య, శివారెడ్డి, గోపాల్, గోవిందు, గౌడనాయక్, మన్యం పాల్గొన్నారు.
మహిళా విద్యకు ప్రోత్సాహం
కొత్తకోట, ఆగస్టు22: మహిళలు విద్యారంగంలో రాణించడానికి రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి ప్రోత్సహించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా ఆదివారం మండలంలోని రాయినిపేట స్టేజీ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికల విద్య కోసం కృషి చేసిన మహనీయుడు వెంకటరామిరెడ్డి అని, రెడ్డి హాస్టల్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పి పేద విద్యార్థుల విద్య కోసం తోడ్పడ్డారన్నారు. నిజాం పరిపాలనలో ఉన్నత పోలీస్ అధికారిగా పని చేసి నిజాం ప్రభువు మెప్పు పొంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారన్నారు. అనేక రంగాల్లో సేవ చేసి అపార ప్రేమాభిమానాలు చూరగొన్న ప్రజా బంధు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అన్నారు. రాజకీయ చైతన్యం పెంపొందించడంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయుడన్నారు. హైదరాబాద్‌లో మహిళా పాఠశాలను, కళాశాలను నెలకొల్పారన్నారు. పట్టణంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, బీజేపీ నాయకులు రాజావర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్ కొండారెడ్డి, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రాములుయాదవ్, నాయకులు వేముల శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, జగన్ ,పాండు పాల్గొన్నారు.