వేడుకలకు ఉమ్మడి జిల్లా సిద్ధం
మార్కెట్లో వివిధ రకాల రాఖీలు
సందడిగా మారిన దుకాణాలు
కిటకిటలాడిన ప్రయాణ ప్రాంగణాలు
‘అన్నా చెల్లెళ్ల
అనుబంధం.. ఇది
జన్మజన్మల సంబంధం’
అన్నాడో సినీకవి. అన్నాచెల్లెలు..
అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా
రక్షాబంధన్‌ను జరుపుకొంటారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి
రోజు ఈ పండుగ వస్తుంది. అన్నాదమ్ముళ్లు చల్లగా ఉండాలని కోరుతూ తోబుట్టువుల చేతికి
రాఖీ కట్టి సోదరులు ఇచ్చే కానుకలను స్వీకరించి.. వారిని ఆశీర్వదిస్తారు. కుటుంబం
మొత్తం ఒక దగ్గరకు చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకలో పాలు పంచుకుంటారు. అంతటి
ప్రాధాన్యమున్న రాఖీ పౌర్ణమిని ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రజలు జరుపుకోనున్నారు. దీంతో
శనివారం రాఖీల కొనుగోలు, మహిళలు పుట్టింటికి పయనంతో
దుకాణాలు, బస్టాండ్లు సందడిగా మారాయి.
ఆత్మకూరు, ఆగస్టు 21 : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగకు తోబుట్టువుల సందడి అంతా ఇంతా కా దు. అత్తారింటికి వెళ్లిన తోబుట్టువులు ఒకటి, రెండు రోజుల ముందుగానే పుట్టింటికి వస్తా రు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతా ల్లో ఉండే సోదరులు కూడా సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఉత్సాహం కనబరుస్తారు.
ఆరోగ్యమే మహాబంధం..
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా జరుపుకొనే రాఖీ పం డుగపై కరోనా ప్రభావం కనబడుతున్నది. ఓ వైపు సడలింపులతో మార్కెట్లన్నీ యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ థర్డ్‌వేవ్ ముప్పుతో మరోవైపు పాజిటివ్ కేసులు విస్తృతం గా పెరుగుతూనే ఉన్నాయి. రాఖీ పండు గ నేపథ్యంలో అన్నా, తమ్ముళ్లకు తానే స్వ యంగా మార్కెట్‌కు వెళ్లి రాఖీని కొనుగోలు చేసేందుకు తోబుట్టువులు ఆసక్తి కనబరుస్తారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్లన్నీ ‘రాఖీ’ సందడి నెలకొనగా అనవసరమైన ఇబ్బందులు పడకూడదంటూ రక్తసంబంధీకులు వేడుకుంటున్నారు. ‘రాఖీ’ కోసం బస్సు ల్లో, ఇతర వాహనాల్లో ఇబ్బందికర ప్రయాణాలు చేయొద్ద ని, ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. నేటి హైటెక్ యుగంలో అత్యాధునికత్వాన్ని వినియోగించుకొని ఇంట్లోనే అందరం ఆరోగ్యంగా ఉండాలని అన్నా, తమ్ముళ్లు ఆకాంక్షిస్తున్నారు. దీంతో చాలామంది అక్కా, చెల్లెళ్లు ఆన్లైన్ బంధానికి మొగ్గు చూపుతున్నారు. కోరిన రాఖీని క్షణా ల్లో ఆర్డర్ చేసి.. దూర ప్రాంతంలో ఉన్న అన్నా, తమ్ముళ్లకు రాఖీని పంపే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా అన్నా, తమ్ముళ్లు సైతం సోదరీలకు బహుమతులను ఆన్లైన్లోనే బుక్‌చేసి పంపిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న మార్పులను వ్యాపార, వా ణిజ్య దిగ్గజ్జాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. అనేక ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ రాఖీ, బహుమతులను తమ వెబ్సైట్లలో పొందుపరిచి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీనికితోడు ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటున్నాయి.
హైటెక్ అనుబంధం..
ఒకప్పుడు రాఖీ కొని.. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పం పేందుకు సెంటర్‌కు వెళ్లేవారు. అయితే నేటి హైటెక్ యు గంలో మనుషుల మధ్య దూరం పెరిగినా అనుబంధాల మ ధ్య మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఎన్ని విపత్కర పరిస్థితు లు వచ్చినా పరిస్థితులకు అనుగుణంగా అనుబంధాలపై ప్రే మానురాగాలు కుమ్మరిస్తారు. రాఖీలను ఆన్లైన్లో పం పించే వెసులుబాటు అందుబాటులోకి రావడమే దీనికి నిదర్శనం. పలు వెబ్సైట్లు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి.
బహుమతులూ రెడీ..
సోదరులు ఇష్టపడే బహుమతులను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి మగువలు మొగ్గుచూపుతున్నారు. కేవ లం రాఖీతో సరిపెట్టుకోకుండా డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్‌తో చేసిన స్వీట్స్‌ను కూడా ఆర్డర్ ఇచ్చి పంపించే వెబ్సైట్లను ఎంచుకుంటున్నారు. సోదరులు సైతం తమ తోబుట్టువులకు ఇష్టపడే చీరలు, కుర్తాలు, వాచ్‌లు, బ్రాస్లెట్లు, అందమైన డ్రె స్సులను పంపించే వెబ్సైట్లు వెతుకుతున్నారు.
అందుబాటులో వేలాది రకాలు..
తక్కువ నాణ్యత గల, వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూత పూసిన రాఖీ, ముత్యాలతో అలంకరించిన రాఖీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రాఖీలు దర్శనమిస్తున్నాయి. చిన్నపిల్లల మనస్సులు దోచేలా బెన్‌టెన్ రాఖీలు, మిక్కీమౌస్ రాఖీలు, బొమ్మల ఆకృతి కలిగిన రాఖీలుసైతంఅందుబాటులో ఉన్నాయి. రూ.100 నుంచి రూ.10 వేలకు పైగా రాఖీలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి.