దట్టీలు సమర్పించిన మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ సత్యం
కల్వకుర్తి, అగస్టు 20 : మత సామరస్యానికి ప్రతీక మొహర్రం (పీర్లపండుగ) అని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పీర్ల పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. కులమతాలకు అతీతంగా ఉత్సవాల్లో ప్రజలు పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ 7వ వార్డు గచ్చుబావి వద్ద నిర్వహించిన పండుగలో మున్సిపల్ చైర్మన్ పాల్గొని పీర్లకు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్‌ను నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ అలయ్‌బలయ్ ఆడారు. మజీద్ నిర్వాహకుల కోరిక మేరకు కొత్త మసీదు నిర్మాణానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎల్ఐసీ సత్యం, సాబేర్, చింత రవి, మూర్తి, ఖాదర్, సాధిక్, శేఖర్, షఫీ, మసీద్ కమిటీసభ్యులు సర్వర్, దస్తీ, ఈదన్న, బురాన్, ఖాదర్, షమీమ్, ఖాజా, వాజీద్, ఎజాస్, అన్వర్, కాలనీవాసులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో..
తిమ్మాజిపేట, ఆగస్టు 20 : తిమ్మాజిపేట మండలకేంద్రంలో మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మ త సామరస్యానికి ప్రతీకైన ఈ పండుగను హిందూ ముస్లిం లు కలిసి జరుపుకొన్నారు. మండలకేంద్రంలో హిందువులు ఇంటి పండుగగా భావించే పీర్ల పండుగకు ఉమ్మడి జిల్లాతోపా టు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. స్థానిక రచ్చబండ వద్ద జరిగే పీర్ల కలయిక (మిలాఖత్)భక్తులకు కనువిం దు చేసింది. హుస్సేనీ ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భక్తు లు వచ్చి కందూర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో జాతర భారీగా సాగింది. దీంతో పలు దుకాణాలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తుల కోసం మంచినీరు, ఇతర వసతులు ఏర్పాటు చేశారు.
బిజినేపల్లిలో మండలంలో..
బిజినేపల్లి, ఆగస్టు 20 : మండలంలోని ఆయా గ్రామాల్లో మొహర్రం పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. చివరిరోజు సాయంత్రం పీర్లచావిడీల వద్దకు ప్రజలు చేరుకొని ఉత్సవాలు జరుపుకొన్నారు. అనంతరం గ్రామాల సమీపంలోని చెరువులు, కుంటల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.
పోలీసుల పహారాలో..
తిమ్మాజిపేట, ఆగస్టు 20 : మండలంలోని బావాజీపల్లిలో పీర్ల పండగ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనిగాయి. దళితులను పండుగలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆలయంలో అందరూ కలిసి పండుగను ప్రశాంతంగా జరుపుకొన్నారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ మోహన్‌రెడ్డి ఉదయం గ్రామానికి వచ్చి పరిస్థితులను సమీక్షించారు. తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాసులు, బిజినేపల్లి, తాడూర్ ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కల్వకుర్తి మండలంలో..
కల్వకుర్తి రూరల్, ఆగస్టు 20 : మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పీర్ల పండుగ ( మోహర్రం)ను కులమతాలకు అతీతంగా జరుపుకొన్నారు. పీర్ల చావిడీలో ఉంచిన పీర్లకు భక్తులు దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
వెల్దండ మండలంలో..
వెల్దండ, ఆగస్టు 20 : మండలపరిధిలోని కొట్ర, చెర్కూర్, పెద్దాపూర్, పోతెపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో మొహర్రం పండుగను ప్రజలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పీర్ల చావిడీల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి గ్రామాల్లో పెద్ద షరియత్ వేడుకల్లో భాగంగా అలయ్‌బలయ్ ఆడారు. ఆయా గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
వంగూరు, ఆగస్టు 20: కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలను మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వంగూరు మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం మొహర్రం వేడుకల్లో పిల్లలు, పెద్దలు పాల్గొని ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
చారకొండ మండలంలో..
చారకొండ, ఆగస్టు 20: కుల మతాలకతీతంగా నిర్వహించే పీర్ల పండుగను మండలంలోని జూపల్లిలో ఘనంగా జరుపుకొన్నారు. పీర్లకు గ్రామస్తులు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం డప్పు చప్పుళ్లతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
ఊర్కొండ మండలంలో..
ఊర్కొండ, ఆగస్టు 20: మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమాల్లో అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కందనూలులో..
కందనూలు, ఆగస్టు 20 : త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ పండుగ చివరిరోజు భక్తులు ఉపవాసాలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలు పానకాలు, మలీజ ముద్దలను పంచి పెట్టారు.
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ గోరటి
తెలకపల్లి, ఆగస్టు 20 : మండలంలోని గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పీర్ల చావిడికి వెళ్లి దట్టీలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.