వనపర్తి, ఆగస్టు 12 : మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మ ఉం టుందని వింటూనే ఉన్నాం. మరో జన్మ ఉంటుందో..లేదో తెలియదు కానీ చనిపోయిన వ్యక్తి అవయవదానం చేయడం వల్ల మరొకరి ప్రాణా లు కాపాడొచ్చు. నేడు జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా
ప్రత్యేక కథనం.
చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాన్ని పనిచేయని ఆర్గాన్ స్థానంలో ఏర్పాటు చేయడాన్ని అవయవమార్పిడి అంటారు. ఎక్కువ మంది కిడ్నీ ఫెయిల్ కావడంతో డయాలసిస్ చే యించుకుంటున్నారు. అ లాంటి వారికి అవయవ దానం చేయడం వల్ల వారి కి సాధారణ జీవితాన్ని అందిచొచ్చు. ఒక మనిషి శరీరంలోని అవయవాలను 18 మందికి దానం చేయొచ్చు. కొన్ని అవయవాలు మనిషి ప్రాణాలను కాపాడితే.. మరికొన్ని అవయవాల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతాయి. చనిపోయిన వ్యక్తి నుంచి గుండె, రెండు జతల కవాటాలు, కిడ్నీలు, నేత్రాలు, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం, ప్రాంకియాసిస్, కర్ణభేరి, యూరినరీ బ్లాడర్, చర్మం, ఎముకలు, ఎముకల్లోని మజ్జ కండరాలను సేకరించొచ్చు. మనిషి అవయవ మార్పి డి చట్టం ప్రకారం ఒక వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధ్దారించిన తరువాతనే అవయవదానం చేయాలి. మెదడు నుంచి ఇతర భాగాలకు సంకేతాలు అందకపోవడాన్నే బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు గుర్తించి వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్‌ను ఎక్కువ ఒత్తిడితో శరీరంలోకి పంపిస్తారు. దీంతో కణాలకు శక్తి అంది అవయవాలు కొన్ని గంటల పాటు పనిచేస్తాయి. ఆ సమయం లో అవయవాలను సాధ్యమైనంత వేగంగా సేకరించి బ్లడ్‌గ్రూప్, తదితర అంశాలు సరిపోలిన వ్యక్తికి నిర్దేశిత సమయంలో అమర్చుతారు.