సాగునీటి రాకతో పెరిగిన భూముల ధరలు
గ్రామాల వైపు ఆసక్తి కనబరుస్తున్న పట్నం వాసులు
వనపర్తి, ఆగస్టు 22 : కరోనాతో చాలా మంది జీవన విధానాలను మార్చేసింది. పట్నానికి వలసలు వెళ్లిన వారు తిరిగి గ్రామాల వైపు బాట పట్టారు. గ్రామాల్లో ఉన్న చిన్న భూములను వ్యవసాయ భూములగా మార్చుకొని సాగుచేసుకుంటూ పల్లె జీవనాన్ని గడుపుతున్నారు. దీంతో పల్లెలకు తిరిగి పూర్వ వైభవం పెరిగింది. ఒకప్పుడు అవసరాలకు భూమిని అమ్ముకుంటే విలువ లేక ఎంత వస్తే అంత దిక్కు అనుకునేవారు. పట్టా కాగితాలు పెట్టుకుని అప్పు ఇవ్వమని అడిగితే ప్రైవేట్ వ్యాపారులు ఇచ్చేవారు కాదు. గతంలో ఎకరాకు లక్ష రెండు లక్షల చొప్పున అమ్ముడు పోతే అదృష్టంగా భావించేవారు. కానీ ప్రస్తుత పల్లె పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఎందుకూ పనికిరాని భూములు ఎకరా రూ.10 లక్షలు అన్నా దొరికే పరిస్థితి లేదు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఎండిన చెరువులు, కుంటలకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావడంతో వ్యవసాయం చేయలేక వలసలు వెళ్లిన చాలా మంది తిరిగి వచ్చి తమ కున్న కొద్దిపాటి భూముల్లో వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో మరిన్ని వర్గాలు సాగువైపు ఆకర్షితులు అవుతున్నారు. బీడు బారిన భూములన్నీ పచ్చని పంటపొలాలుగా మారడం ఒక ఎత్తు అయితే రియల్ ఎస్టేట్ ఊపుతో భూముల ధరలకు రెక్కలు రాగా భూములు దొరకక వేల రూపాయల భూములు కాస్తా లక్షలు దాటుతుంది. జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భూములు లేక దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో భూములను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
అందరిచూపు భూముల వైపే..
గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న భూమిని అమ్ముకుని ఏదైనా వ్యాపారం చేసుకుంటూ బతుకు బండిని నడిపించేస్థాయి నుంచి అందరూ కలిసి కష్టపడి పని చేసి కొద్దిపాటి భూమిని కొందాం అనే స్థాయికి ఇతర జీవనం మారింది. చాలా మంది జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భూములు దొరకక మండలాలు, గ్రామాల్లో భూములను కొంటున్నారు. దీనికి తోడు గ్రామాలు, మండలాలు, పట్టణాల శివారు భూముల్లో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. చాలా వరకు గ్రామాల్లో తమ భూములను అమ్ముకోవడానికి అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు.