ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నంరూరల్/ షాద్‌నగర్‌టౌన్, జనవరి 13 : హిందువులంతా అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగల్లో సంక్రాంతి ప్రముఖ స్థానం సంపాదించుకున్నది. ఇది పుష్యమాసంలో సూర్యుడు ‘మకరరాశి’లో ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్రాంతిలో ‘సం’ అంటే మిక్కిలి అని, ‘క్రాంతి’ అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని ‘సంక్రాంతి’ అంటారు. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కల్లాల నుంచి ఎద్దులబండిలో ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలతో అందరి ఇండ్లు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తూ వాకిళ్లు శుభ్రం చేయటం, వరిపిండితో ముగ్గువేసి, రంగులతో అలంకరించి, వాటి మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి, పువ్వులతో అలంకరిస్తారు. సంక్రాంతి సందర్భంగా హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని నమ్మకం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయిరాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి రమణీయంగా ఉంటాయి. ఈ నెల 14న బోగితో ప్రారంభమై 15న మకరసంక్రాంతి, 16న కనుమ పండుగతో ముగుస్తున్నందున గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవటంతో పండుగ వాతావరణం నెలకొంది.
మొదటిరోజు భోగి..
ఉదయాన్నే లేచి ఇంటిముందు ముగ్గులు వేస్తారు. ముగ్గుమధ్యలో ‘గొబ్బెమ్మ’లను ఉంచుతారు. వీధుల్లో ‘భోగిమంటలు’ వేస్తారు. అప్పటి నుంచే ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడని భోగిమంట సంకేతం. దక్షణాయనంలో నిద్రబద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంటలు వేస్తారు. ఇంట్లో ఉండే పాత వస్తువులాంటివి భోగిమంటలో వేసి తగలబెడుతారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి పేరంటం నిర్వహిస్తారు.
రెండోరోజు సంక్రాంతి..
అన్ని పండుగలు తిథి ప్రకారం తేదీ మార్పులతో వస్తూ ఉంటాయి. కానీ, సంక్రాంతి మాత్రం ప్రతియేడాది జనవరి 14 లేదా 15 తేదీల్లో రావటం గమనార్హం. ఈ రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాడు. మేషాది ద్వాదశి రాశుల్లోకి అంటే పూర్వరాశిలో నుంచి ఉత్తరరాశిలోకి మారుతుంటాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటమే మకర సంక్రాంతి. తెలుగుప్రజలు సంక్రాంతి అని పిలుచుకుంటే, మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అని, తమిళులు ‘పొంగల్’ అని పంజాబీలు ’లోరీ’ అని అంటారు. ఈ పర్వదినానికి పంటలన్నీ ఇంటికి చేరి, రైతులు తమ ఆర్నెళ్ల కష్టాన్ని మర్చిపోవటానికి ఆడపడుచుల్ని, అల్లుళ్లని ఆహ్వానించి, సుఖసంతోషాలతో జరుపుకునే పెద్దపండుగ సంక్రాంతి.
మూడోరోజు కనుము…
కనుమనే పశువుల పండుగ అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామే కాకుండా పశువులు, పక్షులు పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకు ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, చిన్నపిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుండటం, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాక, బంతిపూల తోరణాలు, ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి.
కళకళలాడుతున్న పల్లెలు…
మూడ్రోజులపాటు జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి ప్రజలు గ్రామాలకు చేరుకున్నారు. నిత్యం పనులు చేసుకుంటూ హడావుడిగా కనిపించేవారంతా గ్రామాలకు చేరుకోవటంతో పల్లెల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులను ముందుగానే ఇచ్చారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, పట్నం వలస వెళ్లిన వారు పెద్ద ఎత్తున పల్లెలకు పయనమయ్యారు. చిన్నపిల్లలు గ్రామాల్లో గాలిపటాలను ఎగురవేస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్‌తో పాటు ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
పండుగ సందర్భంగా గ్రామాలకు చేరుకున్న విద్యార్థులు, పెద్దలు ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి. ఈ సందర్భంగా నిర్వహించే క్రీడాపోటీల్లో ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుకలను నిర్వహించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
సంక్రాంతి రోజున ఇష్టదైవాలను పూజించాలి
మకర సంక్రాంతి పీడ పరిహార పండుగ. దీనిని పీడ పండుగ అని చెప్పడం సరికాదు. ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. అతి పవిత్రమైన మకర రాశిలోకి శ్రీ సూర్యనారాయణుడు ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగగా పిలుస్తారు. ఈ సంక్రాంతి రోజున ఇష్టదైవాలను పూజిస్తే సకల శుభాలు జరుగుతాయి.
-రవిశర్మ, బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడు షాద్‌నగర్