
మౌలిక సదుపాయాల కల్పన
పల్లెప్రగతితో సంపూర్ణ పారిశుద్ధ్యం
వైకుంఠధామం, డంపింగ్‌యార్డు ఏర్పాటు
నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులు పూర్తి
మోమిన్‌పేట, ఆగస్టు 29 : గ్రామ పంచాయతీల్లో వివిధ సమస్యలకు చరమగీతం పాడేందుకు మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడిచేలా ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లెప్రగతిలో భాగంగా గోవిందపురం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 213 కుటుంబాలు, 895 జనాభా ఉన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ నల్లాను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు.
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం
గ్రామంలో అర ఎకరంలో ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసి వనంలో మామిడి, జామ, దానిమ్మ, నీలగిరి, నేరేడు, డిజైన్ మొక్కలు, పూలు, ఔషధ మొక్కలు నాటారు. వీటికి ప్రతి రోజూ నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. దీంతో ఆహ్లాదకరంగా మారి మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయి.
పూర్తయిన అభివృద్ధి పనులు
పల్లెప్రగతి ద్వారా ఏర్పాటు చేసిన వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీ పనులు పూర్తయ్యాయి. ప్రతి రోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు.
ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంత
గ్రామాన్ని స్వచ్ఛతగా నిలిపేందుకు గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు.
పరిసరాల పరిశుభ్రతకు చర్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీరకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ప్రతి రోజూ గ్రామంలో చెత్త సేరకణ, మురుగు కాలువల శుభ్రం చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం.