
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తండాలు
నూతన పంచాయతీలతో సమకూరిన మౌలిక వసతులు
‘పల్లె ప్రగతి’, ప్రత్యేక నిధులతో చకచకా అభివృద్ధి పనులు
రూపురేఖలు మారిన నందిగామలోని చాకలిగుట్ట తండా, కొత్తూరులో కొడిచెర్ల తండా, వైఎం తండా, మల్లాపూర్ తండా
కొత్తూరు, ఆగస్టు 29: తండాలను పంచాయతీలుగా చేయడం, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలను తీసుకురావడంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గతంలో అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలను పట్టించుకునే నాథుడే లేడు. కనీస సౌకర్యాలకూ కరువే. తాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఉండేది. తండాలకు వెళ్లడానికి కనీసం రోడ్డు కూడా ఉండేది కాదు. కంప చెట్లు, గుంతల రోడ్లు, పాడుబడిన ఇండ్లు తప్ప ఏమీ కనిపించేవి కావు. ఇలాంటి పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ తండాలను ప్రత్యేక పంచాయతీగా మార్చితే తప్ప అభివృద్ధి జరుగదని గట్టినా నమ్మారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలు ముందు 500 జనాభా ఉన్న ప్రతి తండాను పంచాయతీగా మారుస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. రాష్ట్రంలోని 500 జనాభా ఉన్న ప్రతి తండాను పంచాయతీగా ఏర్పాటు చేసి గిరిజనుల చిరకాల కోరిక తీర్చి వారి హృదయంలో నిలిచారు సీఎం కేసీఆర్. కొత్త పంచాయతీలుగా మార్చిన తండాలు మూడేండ్లలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కొత్త పంచాయతీల్లోని గిరిజనుల తమ తండాల్లో తమ పాలన రావడంతో అబ్బురపడేలా అభివృద్ధి చేసుకుంటున్నారు. చూడచక్కని రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, కంపోస్టు షెడ్లు, చెత్త డంపింగ్ యార్డులకు తరలించడానికి ట్రాక్టర్లను సమకూర్చుకున్నారు.
చాకలిగుట్ట తండాలో రూ.1.63 కోట్లతో అభివృద్ధి
నందిగామ మండలంలో నూతనంగా ఏర్పడిన ఏకైక తండా పంచాయతీ చాకలిగుట్ట తండా. ఈ తండా కొత్త పంచాయతీగా ఏర్పడక ముందు రంగాపూర్ గ్రామ పంచాయతీలో అనుబంధ గ్రామంగా ఉండేది. ఇక రంగాపూర్‌లో అవసరాలు తీరిన తర్వాత అరకొర నిధులు చాకలిగుట్ట తండాకు కేటాయించేవారు. దీంతో ఆ తండాలో సమస్యలు పేరుకుపోయాయి. నూతనంగా పంచాయతీగా మార్చడంతో అభివృద్ధి చెందింది. చాకలిగుట్టలో మొత్తం మూడు తండాలు ఉంటాయి. అందులో చాకలిగుట్ట తండా, ధన్సింగ్ తండా, తాటిగడ్డ తండా. ఈ తండాల్లో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. అంతర్గత డ్రైనేజీల కోసం రూ.28.70 లక్షలు వెచ్చించారు. రూ.5.02 లక్షలతో స్ట్రీట్ లైట్లు వేశారు. పల్లెప్రకృతి వనం కోసం రూ.7.80 లక్షలు ఖర్చు చేశారు. కంపోస్టు యార్డు, వైకుంఠధామం పనులు కొనసాగుతున్నాయి. గ్రామాన్ని గ్రీనరీగా మార్చడం కోసం 16 వేల మొక్కలు నాటారు. అంతేకాకుండా నర్సరీ ఏర్పాటు చేసి 10 వేల మొక్కలు పెంచుతున్నారు. మిషన్ భగీరథలో భాగంగా 6 వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రతిరోజా చాలినన్ని మంచినీరు అందిస్తున్నారు. కొత్తూరు మండలంలో మూడు తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. అవి కొడిచెర్ల తండా, మల్లాపూర్ తండా, వైఎం తండా.
కొడిచెర్ల తండాలో రూ.2.34 కోట్లతో పనులు
కొత్తూరు మండలంలోని ఖాజిగూడ తండా, కొడిచెర్ల తండాను కలిసి కొడిచెర్ల తండా పంచాయతీగా ఏర్పాటు చేశా రు. ఈ తండాలో మొత్తం రూ.2.34 కోట్లు వెచ్చించి అన్ని వసతులు సమకూర్చుకున్నారు. వాటితో పాటు జడ్పీ నిధుల నుంచి రూ.1.52 కోట్ల ఖర్చు చేసి రెండు తండాల్లో సీసీ రోడ్లు వేశారు. అందులో భాగంగా కొడిచెర్ల తండాలోని అన్ని రోడ్లను సీసీలుగా మార్చారు. ఖాజిగూడ తండాలో చాలా వరకు సీసీ రోడ్లు నిర్మించారు. ఇక కొడిచెర్ల తండాలో వైకుంఠధామం, కంపోస్టుషెడ్డు, పల్లెప్రకృతి వనాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, స్ట్రీట్‌లైట్లు, మిషన్ భగీరథ మంచినీరు ఇలా వసతులు కల్పించుకున్నారు.
మల్లాపూర్ తండాలో రూ.67 లక్షలు
చిన్న పంచాయతీ అయిన మల్లాపూర్ తండాలో రూ. 67 లక్షలతో అన్ని వసతులు సమకూర్చుకున్నారు. రూ. 5 లక్షలు వెచ్చించి డ్వాక్రా భవనం నిర్మించారు. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మించారు. నర్సరీ, పల్లెప్రకృతి వనంలో మొక్కలు పెంచి, గ్రామాన్ని పచ్చలహారంగా మార్చారు. రూ.10.5 లక్షల యూజీడీ నిధుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
వైఎం తండాలో రూ.43 లక్షలు
చిన్న పంచాయతీ అయిన మల్లాపూర్ తండాలో వివిధ అభివృద్ధి పనులకు రూ.4,353,351 ఖర్చు చేశారు. ఈ నిధులను గ్రామంలో సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ట్రాక్టర్, ప్రైమరీ స్కూల్ కంపౌండ్, నర్సరీ, నర్సీరీలకు కంపౌండ్, గేట్ తదితర వాటికోసం ఖర్చు చేశారు.
పంచాయతీలతోనే అభివృద్ధి
గతంలో మా తండా వేరే గ్రామంలో కలిసి ఉండడంతో అభివృద్ధిలో వెనుకబడింది. మల్లాపూర్ తండాను పంచాయతీగా ఏర్పాటు చేసిన తర్వాత మా తండాలో మా పాలన వచ్చింది. దీంతో మా తండాలో మౌలిక సదుపాయాలు కల్పించుకుని, అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. పంచాయతీగా మార్చిన సీఎం కేసీఆర్, అంజయ్య యాదవ్‌కు ఎప్పటికీ మర్చిపోం. వారికి ఏ పనిలో
అయినా వెన్నుదన్నుగా నిలుస్తాం.
నిధులు సమకూరుస్తున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతోనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. మా గ్రామానికి ఏ పని కావాలన్నా వెంటనే స్పందిస్తారు. అడిగినన్ని నిధులు సమకూర్చుతారు. తండాలు పంచాయతీలుగా మారిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో మా ప్రజలకు కన్పిస్తున్నది. ఒకప్పుడు తాగడానికి కనీసం నీరు కూడా దొరికేది కాదు. ఇప్పుడు మిషన్ భగీరథతో కావాల్సినంత నీరు ఇస్తున్నాం. ఇంకా మా తండాలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటున్నాం.