
వికారాబాద్ జిల్లా పరిగిలో, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో సమావేశాలు… పాల్గొన్న కలెక్టర్లు పౌసుమిబసు, అమయ్ కుమార్, రెండు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే వ్యవసాయం పండుగలా సాగనున్నది… అన్ని వర్గాల ప్రజలకు లాభదాయకంగా ఉంటుంది… ఎన్నో ఏండ్ల కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది… ఈ పథకంతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేవు… వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తే ఎంతో మేలు జరుగుతుంది…’ అని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రైతులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో కలెక్టర్లు పౌసుమిబసు, అమయ్‌కుమార్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ‘పాలమూరు’కు సై అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులూ సానుకూలంగా స్పందించారు. పలువురు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా అందజేశారు. త్వరలో కేంద్ర పొల్యూషన్ బోర్డుకు ప్రజాభిప్రాయాల నివేదికను సమర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. సమావేశాల్లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, ఇరు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమైంది.
పరిగి, ఆగస్టు 10: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పరిగిలోని బృందావన్ గార్డెన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పౌసుమిబసు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్ఈ సురేశ్ ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు మేథావులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ పథకంతో వికారాబాద్ జిల్లాలో సాగునీరు అందుతుందని, తద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటిపై ఆధారపడిన కులవృత్తులు, ఇతర వర్గాల వారు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అనేక ఏండ్లుగా ఈ ప్రాంత రైతుల కలగా ఉన్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తామంతా అనుకూలమని తేల్చి చెప్పారు. ఈ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, దీంతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి జిల్లాలోని భూములకు సాగునీరు అందించాలని కోరారు.
అనంతరం కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 417 గ్రామాలున్నాయి. వాటి పరిధిలో 3,41,952 ఎకరాలకు సాగునీరు అందుతుందని కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలు సేకరించి కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నివేదిక రూపంలో పంపించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 36 మంది మాట్లాడారని, 19 మంది లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలు వెల్లడించారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్ఈ సురేశ్ తెలిపారు. వాటిని వీడియో రికార్డింగ్‌లతో సహా నివేదికను కేంద్ర పొల్యూషన్ బోర్డుకు అందజేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్, నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ నారాయణ స్వయంగా పర్యవేక్షించారు.
తలకొండపల్లి ఆగస్టు 10: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమయ్యింది. తలకొండపల్లి మండలంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హల్లో కలెక్టర్ అమయ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు తమ అభిప్రాయాలు తెలిపారు. వీలైనంత తొందరగా ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రైతులు, ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని కోరారు. తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల మండలాలకు చెందిన వేలమంది రైతులు ఎన్నో ఏండ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. నియోజకవర్గానికి చెందిన రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయన్నారు. సముద్రమట్టానికి ఎత్తు ప్రాంతంలో ఉన్న కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాలకు ప్రాజెక్టు ఒక్కటే శరణ్యమన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని రైతులు తమ ప్రాంతంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తామంతా ప్రాజెక్టు నిర్మాణానికి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. వివిధ గ్రామాలకు చెందిన 33 మంది రైతులు తమ అభిప్రాయాలు తెలిపారు. రైతులు తెలిపిన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందజేసి పర్యావరణ అనుమతులు పొందేలా నివేదికలు పంపుతామన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద 20 మండలాల్లోని 330 గ్రామాల్లో 3,59,047 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ వినియోగంలో కి వచ్చిన తర్వాత భూగర్భ జలాలు పెరగడం, అదనంగా నీటి సామర్థ్యం, ఆయకట్టు ప్రాంతాల్లోని రైతుల జీవన ప్రమాణాల్లో మెరుగుదల ఉంటుందన్నారు. ప్రాజెక్టు పనులు, మత్స్య సంపద ద్వారా ఉద్యోగ అవకాశాలు, పశువుల పెంపకం, వినోదం, పర్యాటకం, ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు మెరుగైన రితీలో అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు వెలువరించిన అభిప్రాయాలు వీడియో రికార్డింగ్ చేయించి, వీటిని కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. పర్యావరణ ఇంజినీరు వెంకన్న ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రెండో ఫేజ్ కెనాల్ ఏర్పాటు, ఆవశ్యకత, అందుకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా లాభాలు ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఏర్పడే పర్యావరణ నష్టం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్‌పై తెలుగు, ఆంగ్లంలో పూర్తి వివరాలు గణంకాలతో సహా వివరించారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు ఈఈ వెంకన్న, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, కందుకూరు ఆర్డీవో వెంకటాచారి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. భూమి ని నమ్ముకుని జీవిస్తున్న రైతాంగానికి ఇదో వరం. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలోని భూములకు అవసరమైనంత సాగు నీరు అందించడం ద్వారా అనేక రకాల పంటలు పండించవచ్చు. ఈ ప్రాంతంలో పర్యావరణానికి మరింత మేలు చేసే విధంగా పచ్చదనం పెరుగుతుంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పంటల సాగుకు భారీగా నీరందుతుంది. దీంతో ఆయా రంగాలపై ఆధారపడే కులవృత్తులకు మేలు కలుగుతుంది. కులవృత్తుల వారికి చేతినిండా పని లభిస్తుంది. ప్రాజెక్టు నీటితో చెరువులు, కుంటలు నింపనుండడం ద్వారా చేపల పెంపకానికి ఎంతో దోహదం చేస్తుంది. తద్వారా ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు సంవత్సరం పొడవునా చేపల పెంపకంతో ఆర్థికంగా లాభం చేకూరుతుంది.
ప్రాజెక్టుల నిర్మాణంతో భూములకు పుష్కలంగా నీరంది, పంటలు బాగా పండుతాయి. దీంతో రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. సాగు నీరు లేక అన్నమో రామచంద్రా అనే అన్నదాతల బీడుభూములకు ఇలాంటి పథకాల ద్వారా నీరందించడం హర్షించదగ్గ విషయం. దీంతో రైతులు అన్ని విధాలుగా ఆర్థికంగా నిలదొక్కుకుని, గర్వంగా నిలబడగలుగుతారు. ఏటా పంట దిగుబడు అధికంగా పండడంతో ఆ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.
– భాస్కర్‌రెడ్డి, రైతు, చెన్నారం, తలకొండపల్లి మండలం
ఎప్పుడు కరువుతో అల్లాడే ఈ ప్రాంతానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి సాగునీరు, తాగునీటిని అందిస్తామన్న సీఎం కేసీఆర్‌కి రుణపడి ఉంటాం. ఎత్తిపోతల పథకంతో రైతులకు, కూలీలతోపాటు ఎంతో మందికి చేతి నిండా పని లభిస్తుంది. ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఉపాధి దొరక్క ఎన్నో కుటుంబాలు వలసలు పోతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుంది. కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల్ మం డలాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. పర్యావరణశాఖ అధికారులు త్వర గా అనుమతిచ్చి ఈ పథకాన్నిన పూర్తి చేయాలని కోరుతున్నాం.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఈ ప్రాంత రైతులు ఎన్నో ఎండ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. నీరొస్తే ఆత్మస్థైర్యంతో వ్యవసాయం చేసుకుంటాం. భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసా యం చేసేకునే తామందరం ప్రాజెక్టు నీళ్లతో పంటలు పండించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. రైతుల ఆకాంక్ష తీరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. – రాజమోని తిరుపతి దేవునిపడకల్
రైతాంగం బాగు కోసమే ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీ కారం చుట్టింది. ఇంత చక్కటి కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలి. ఈ ప్రాం తానికి సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాం తానికి తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి దక్కుతుంది. వ్యవసాయంతోపాటు పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందుతుంది.
ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్నది. ఈ ప్రాంతంలో వ్యవసాయరంగంతోపాటు దాని అనుబంధ రంగాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. నీరు పుష్కలంగా ఉంటే అనుకున్న దానికంటే అధికంగా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. త ద్వారా ఈ ప్రాంత రైతుల ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. ప్రతి గ్రామం పంటలతో కళకళలాడుతుంది.