
షాబాద్/బొంరాస్పేట, ఆగస్టు 8: పూజల మాసమైన శ్రావణం మాసం నేటి నుంచి ప్రారంభం కానున్నది. అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు, ఉపవాసాలు, నియమ నిష్టలతో చేస్తారు. ప్రతిరోజు ఒక విశిష్టత కలిగి ఉంటుంది. సోమవారం శివుడు, మంగళవారం మహాగణపతి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వరస్వామి, ఆదివారం సూర్యుడిని ఆరాధిస్తారు. శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్ 7 అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణ మాసం వ్రతాలు, పూజలు, ఉపవాసాలకు పెట్టింది పేరు. ఈ నెలలో ఎన్నో పండుగలు వస్తాయి. నేటితో ప్రారంభమయ్యే పూజలకు ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు ముస్తాబయ్యాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో శుక్ర, శని, సోమ, మంగళ వారాలు నాలుగేసి చొప్పున రావడం విశేషం. నెల రోజుల పాటు ప్రతి దేవాలయంలో రాత్రిపూట భజనలు చేస్తారు. ఆంజనేయ స్వామికి చందనంతో అభిషేకాలు చేస్తారు. శ్రావణమాసం ముగింపు రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేస్తారు.
శ్రావణమాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల చవితి. కుటుంబంలో సర్ప దోషం ఉండకుండా పుట్టలున్న దేవాలయాలకు వెళ్లి నాగుల విగ్రహాలకు పాలుపోసి పూజిస్తారు.
13వ తేదీ శుక్రవారం నాగుల పంచమి. చవితి రోజు ఉపవాసం ఉన్న వారు నువ్వుల ఉండలు, పేలాలను నాగులకు నైవేద్యంగా పెడతారు. రాహు, కేతువు దోషం ఉండకుండా నాగేంద్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఐదు వరుసల దారంతో మాలగా చేసి నాగేంద్రుల విగ్రహాలపై ఉంచి పూజలు చేసిన తరువాత దాన్ని చేతికి కంకణంగా ధరిస్తారు. నాగుల పంచమినే గరుఢ పంచమిగా కూడా వ్యవహరిస్తారు.
వరలక్ష్మీ వ్రతం (20వ తేదీ)
వరాలు కురిపించాలని అష్టలక్ష్మీదేవతా మూర్తులను మహిళలు పూజిస్తారు. దేవాలయాలు, ఇండ్లలో సామూహికంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు చేస్తారు.
అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగాలకు చిహ్నంగా నిలిచేది రాఖీ పండుగ. అక్కాచెల్లెళ్లు పుట్టింటికి వచ్చి అన్నా, తమ్ముళ్లకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి, వారిని దీవిస్తారు. అన్నలు, తమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు కానుకలు ఇస్తారు. తెలుగింటి లోగిళ్లలో పండుగ శోభను తెచ్చేది రాఖీ పౌర్ణమి.
ఇంట్లో తలపెట్టిన పనులకు అవాంతరాలు, సంకటాలు కలుగకుండా శుభప్రదంగా జరుగాలని గణపతిని గరిక, పత్రితో ఏకవంశతీ పూజ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వినాయకుడి ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతుంటారు.
శ్రీకృష్ణ భగవానుడి పుట్టిన రోజును జన్మాష్టమి అంటారు. ఈ రోజు దేవాలయాల్లో భజనలు, ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి కృష్ణుడికి డోలారోహణం చేస్తారు. చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలతో అలరిస్తారు. మరుసటి రోజు ఉదయం ఉట్టి కొట్టే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గ్రామాల్లో పెరుగు బసంతంగా కూడా పిలుస్తారు.
శ్రావణమాసంలో మంగళవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు దీర్ఘ సుమంగళులుగా, సకల సౌభాగ్యాలనూ, సత్సంతానాన్ని పొంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించే భాగ్యాన్ని పొందడానికి ఈ వ్రతాలు చేస్తారు. పెండ్లి కావాల్సిన యువతులు సరైన భాగస్వామి కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. గౌరీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెను శ్రావణమాసంలో ప్రతి మంగళవారం పూజిస్తే మాంగల్య సిద్ధి లభిస్తుంది.
శ్రావణమాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు చేయడంతో భగవంతుడి అనుగ్రహం కలిగి శుభం కలుగుతుంది. మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిష్టతో చేయడంతో వారికి ఆయురారోగ్యాలు, సంపదలు కలుగుతాయని నమ్మకం.