వికారాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు అలుగుపారుతున్నాయి. దీనికి తోడు తాజాగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు డివిజన్లోని పెద్దేముల్-గాజీపూర్ మధ్య, మంభాపూర్-కందనెల్లి, మన్సాన్పల్లి-తాండూరు, అల్లాపూర్-తాండూరు, బెల్కటూర్-కరన్కోట్ల మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దోర్నాల్-ధారూరు మధ్య ఉన్న కాగ్నా నది దాటుతుండగా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి ఒకరిని కాపాడగా, మరో వ్యక్తి మృతి చెందాడు. అత్యధికంగా మోమిన్‌పేట్‌లో 10 సె.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారుల వద్ద కల్వర్టులపై నుంచి ప్రవహించిన వరద నీటితో వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిగి, సెప్టెంబర్ 5: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి కురిసిన వర్షంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాగులు వరద నీటితో పొంగిపొర్లాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు నీటితో నిండాయి. మిగతా చెరువులన్నీ నిండిపోయి అలుగు పారుతున్నాయి. ప్రధాన రోడ్లపై గల కల్వర్టులు, కాజ్‌వేల వద్ద వాగులు ఉధృతంగా పొంగిపొర్లాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లావ్యాప్తంగా మోమిన్‌పేట్‌లో అత్యధికంగా104.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 41.0 మి.మీ, నవాబుపేట్‌లో 10.4 మి.మీ, వికారాబాద్ 3.4 మి.మీ, పూడూరు 6.4 మి.మీ, పరిగి 8.2 మి.మీ, కులకచర్ల 60.2 మి.మీ, దోమ 67.0 మి.మీ, ధారూరు 33.4 మి.మీ, బంట్వారం 47.6 మి.మీ, తాండూరు 54.4 మి.మీ, యాలాల 29.0 మి.మీ, పెద్దేముల్ 37.4 మి.మీ, బషీరాబాద్ 69.8 మి.మీ, బొంరాస్‌పేట్ 18.4 మి.మీ, కొడంగల్ 54.8 మి.మీ, దౌల్తాబాద్‌లో 18.2 మి.మీల వర్షపాతం నమోదైంది.
పొంగిపొర్లుతున్న వాగులు
తాండూరు డివిజన్లో భారీ వర్షానికి పెద్దేముల్-గాజీపూర్ మధ్య, మంబాపూర్-కందనెల్లి, మన్సాన్పల్లి-తాండూరు, అల్లాపూర్-తాండూరు, బెల్కటూర్-కరెన్కోట్ల మధ్య వాగులు, దోమ మండలంలో పాలేపల్లి వాగు ఉధృతంగా ప్రవహించాయి. కరన్‌కోట్ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని రైల్వే లాడిష్లో తాండూరులోని జిల్లా దవాఖానకు తరలించారు. వికారాబాద్ డివిజన్లోని దోర్నాల్-ధారూరు మధ్య గల కాగ్నా నదిలో రోడ్డు దాటుతుండగా ఒక వ్యక్తి నీటిలో ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
నీట మునిగిన పంటలు
కొడంగల్, సెప్టెంబర్ 5: కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలిచి మొక్కలు పెరగక, వాడిపోతున్నట్లు వాపోతున్నారు. కొడంగల్‌లో మొత్తంగా 47వేల ఎకరాల్లో సాగైంది. ఇందులో 20వేల కంది, 18వేలలో పత్తితో పా టు మిగతా 9వేలలో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
భారీ వర్షానికి పొంగిన వాగులు
దోమ, సెప్టెంబర్ 5: మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని దోమ, రాకొండా, తిమ్మాయిపల్లి, మోత్కూ ర్ తదితర గ్రామాల్లో చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. కాకరవేణి వాగు ఉధృత ప్రవాహం కారణంగా గంజిపల్లి గేటు సమీపంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు.
దోర్నాల్ వాగులో వ్యక్తి గల్లంతు
ధారూరు, సెప్టెంబర్ 5: వాగు దాటేందుకు ప్రయత్నించి ఒక వ్యక్తి గల్లంతై, మృతి చెందిన ఘటన ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలంలోని దొర్నాల్ గ్రామానికి చెందిన అరిజన్ గోరయ్య(35), కృష్ణ శనివారం రాత్రి ధారురు స్టేషన్ గ్రామంలో పీర్ల పండగ ఉత్సవాలకు వెళ్లి, ఆదివారం ఉదయం స్వగ్రామానికి తిరిగుపయనమయ్యారు. వాగు అప్పటికే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వాగు దాంటేందుకు ప్రజలను అనుమతింలేదు. పోలీసులు గస్తీ ఉండగానే, వీరు కొద్ది దూరం వాగుకు ఎగున ఉన్న చెక్ డ్యామ్ వద్ద దాటేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరూ వాగులో గల్లంతయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి కృష్ణను కాపాడారు. గొరయ్య ఆచూకీ లభించలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో వెదికించినా ఫలితంలేదు. వాగులో కొద్ది దూరంలో నీటిపై తేలి ఉండడం గమనించారు. అప్పటికే గోరయ్య మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఆనం ద్, జిల్లా ఎస్పీ నారాయణ, తహసీల్దార్ భీమయ్య సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.