కొడంగల్, సెప్టెంబర్ 4 : కొడంగల్ మార్కెట్ యార్డులో పాలక మండలి సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటర్‌ను శనివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి కలిసి ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, వేగవంగా పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పట్టణ పరిధిలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, గాంధీనగర్ వీధిలోని పెద్ద బావి గంతను పూడ్చివేయాలని వీధివాసులు ఎమ్మెల్యేను కోరారు. ప్రస్తుత వర్షాలకు నీరు నిండుకొని దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నానని, మంజూరైన పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ అభివృద్ధికి కావాల్సినంత నిధులు మంజూరు అవుతున్నప్పటికీ పనులు జరుగడంలేదని పేర్కొన్నారు. మంజూరైన పనులు పూర్తయితే మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.