తాండూరు నియోజకవర్గానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్నది. నైజాం నవాబుల కాలంలో కొనసాగిన జాగీర్దారుల పాలనకు సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి. పల్లెల్లో నిర్మించిన పెద్ద పెద్ద కోట బురుజులు, రక్షణ గోడలు నేటికీ చెక్కుచెదరలేదు. అప్పట్లో గుల్బర్గా జిల్లా కేంద్రంగా బషీరాబాద్ ఉండేదట. ఇక్కడే జిల్లా ప్రధాన జైలు, కోర్టుల సముదాయం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. 1918లోనే నవాంద్గి గ్రామం పేరిట బషీరాబాద్‌లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతున్నది. నాడు తాండూరు పట్టణంలో నిర్మించిన శ్రీభావిగి భద్రేశ్వర ఆలయం నేటికీ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. యాలాల మండలంలో చేనేత వస్త్ర వ్యాపారం జోరుగా సాగేదట. ఇక్కడ జరిగే సంతలో రత్నాలు కూడా అమ్మేవారట. తాండూరు పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలు పెంచేవారట. మామిడి పండ్ల నుంచి రసాన్ని (తాండ్ర) తీసి విక్రయించేవారట. దీంతోనే తాండ్ర అనే పదం నుంచే తాండూరుగా పేరు వచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు. తాండూరు చరిత్రపై ఈ ఆదివారం ‘నమస్తే
తెలంగాణ’ ప్రత్యేక కథనం..
తాండూరు, సెప్టెంబర్ 4 : తాండూరుకు నాలుగువందల ఏండ్ల ఘనచరిత్ర కలదు. వందేళ్ల క్రితం వరకు అంతగా అభివృద్ధి చెందని నియోజకవర్గ గ్రామాలు ఆ తరువాత అభివృద్ధికి నోచుకున్నాయి. నైజాం నవాబుల కాలంలో ఓ వెలుగు వెలిగిన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నేటికీ చారిత్రక కట్టడాలు సజీవంగా ఉండి ఈ ప్రాంత చరిత్రను చాటి చెబుతున్నాయి. నైజాం నవాబుల కాలంలో పలువురు జాగీర్దారులు నియోజకవర్గంలోని పలు గ్రామాలను తమ ఆధీనంలో పెట్టుకొని పరిపాలన కొనసాగించారు. నైజాం నవాబుల కాలంలో నియోజకవర్గంలోని తాండూరు మండలం కరన్‌కోట్, బషీరాబాద్, యాలాల మండలాల్లోని పలు గ్రామాలు పెద్ద గ్రామాలుగా కొనసాగాయి. బషీరాబాద్ ఏకంగా అప్పటి మైసూర్ రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాకు కేంద్రంగా కొనసాగడం విశేషం. 1948లో భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటయ్యే వరకు బషీరాబాద్ గుల్బర్గా జిల్లాకు కేంద్రంగా కొనసాగింది. ఆ సమయంలో బషీరాబాద్‌లో ఓ ప్రధాన జైలు భవనాన్ని, జిల్లా కోర్టుల భవనాన్ని నిర్మించారు. ఈ రెండు భవనాలు చారిత్రక నిలయాలుగా నేటికి ఉన్నాయి. అప్పట్లో జిల్లా కేంద్రంగా బాసిల్లిన బషీరాబాద్‌లో ఆధునిక రీతిలో రోడ్డు మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న టౌన్ ప్లానింగ్, లే అవుట్ విధానాన్ని వందేళ్ల క్రితమే బషీరాబాద్‌లో నైజాం నవాబులు అమలు చేయడం గమనార్హం. బషీరుదౌలా అనే జాగిరుదారు బషీరాబాద్‌ను స్థిరనివాసంగా ఏర్పాటు చేసుకుని 1940 వరకు ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేసి నైజాం నవాబులకు పన్నును చెల్లించేవారని పూర్వీకులు చెబుతున్నారు. ఆయన పేరిటే బషీరాబాద్ ఏర్పాటైనట్లు సమాచారం. అప్పటి వరకు పక్కన ఉన్న నవాంద్గి గ్రామమే బషీరాబాద్‌కు ప్రధాన గ్రామం. కాలక్రమంలో నవాంద్గి బషీరాబాద్‌కు అనుబంధ గ్రామంగా మారింది. బషీరాబాద్ గ్రామం ఏర్పాటు కాకముందే నవాంద్గి గ్రామం పేరిట బషీరాబాద్‌లో 1918లో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1924-28ల మధ్య కాలంలో బషీరాబాద్‌లో గుల్బర్గా జిల్లాకు కేంద్రమైన జిల్లా కేంద్ర కార్మాగారం, జిల్లా కోర్టుల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని జీవన్గి, కంసాన్పల్లి, కొర్విచేడ్, మాసన్పల్లి, ఎక్మాయి, దామర్చేడ్ గ్రామాలు దొరల ఆవాసాలుగా ఉండేవి. తాండూరు మండలం కరన్‌కోట్, కోటబాస్పల్లి, మల్కాపూర్, పెద్దేముల్, యాలాల మండలం గ్రామాల్లో పెద్దకోట బురుజులు అలనాటి చరిత్రకు సాక్షాలుగా నిలిచాయి. ఆ కాలంలో శత్రువుల నుంచి, క్రూర మృగాలు, దొంగల నుంచి రక్షణ పొందేందుకు పెద్ద గ్రామాల్లో కోట బురుజులను ఏర్పాటు చేసుకొని జాగీరుదారులు గ్రామాలకు రక్షణ కల్పించేవారు. ఎవరైనా శతృవులువస్తున్నారంటే ఆ సమాచారం తెలుసుకొని కోట బుర్జుల పైనుంచి వారిపై తుపాకులతో దాడులకు పూనుకునేవారని సమాచారం.
1920లో తాండూరు అభివృద్ధి..
నైజాం పాలన 1920 ప్రాంతంలో తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందింది. మొదట పాత తాండూరు పట్టణం మాత్రమే ఉండేది. పట్టణంలో ప్రస్తుతం ఉన్న శ్రీభావిగి భద్రేశ్వర ప్రధాన ఆలయమే కనిపించేది. ఆ సమయంలో భద్రేశ్వర గుడి పరిసరాలన్నీ పొలాలు, అడవులతో నిండుకుని ఉండేది. తాండూరు పరిసరాల్లోని పాత తాండూరు, కోకట్, రసూల్పూర్ తదితర గ్రామాల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలు పెంచేవారని సమాచారం. ఆ సమయంలో ఇక్కడి మామిడి తోటల నుంచి మామిడి పండ్లను ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు. అలాగే మామిడి పండ్ల నుంచి రసాన్ని (తాండ్ర)ను తీసి విక్రయించేవారు. ఈ కారణంగానే తాండూరు పట్టణానికి తాండ్ర అనే పదం నుంచే వచ్చినట్లు కథనం. ఈ తాండ్ర పదం పేరుతోనే 1870 ప్రాంతంలో పాత తాండూరు పట్టణం ఏర్పాటైంది. పాత తాండూరు పట్టణానికి ప్రస్తుత కోటేశ్వర దేవాలయాన్ని ఆనుకొని పెద్ద కోట గోడ ఉండేది. 1990లో తాండూరు-వాడి డబుల్ రైల్వేలైన్ నిర్మాణం కోసం ఈ మట్టి కోట గోడనుంచి మట్టిని వినియోగించినట్లు సమాచారం. దీంతో పాత తాండూరు కోట బురుజు ఆనవాళ్లు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యాయి.
యాలాలకు రెండు శతాబ్ధాల ఘన చరిత్ర
తాండూరు నియోజకవర్గంలోని ప్రస్తుత యాలాల మండల కేంద్రం 200 ఏండ్ల క్రితమే ఘన చరిత్రను కలిగి ఉంది. వందలాది చేనేత కుటుంబాలు యాలాల గ్రామాన్ని స్థావరంగా ఏర్పాటు చేసుకొని చేనేత వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఆ సమయంలో ఇక్కడ జరిగే సంతలో రత్నాలు కూడా అమ్మేవారని కథనం. యాలాల చరిత్రకు సాక్షంగా వందకు పైగా నేత కుటుంబాల గృహాలు నేడు శిథిలావస్థలో కొట్టు మిట్టాడుతున్నాయి. తాండూరు పరిసరాల్లోని ప్రజలు కూడా యాలాల సంతకు వెళ్లి సరుకులు, రత్నాలు కొనుగోలు చేసేవారని ప్రచారం. 1930 వరకు యాలాల ఈ ప్రాంతంలో ప్రధాన పట్టణంగా బాసిల్లింది.