‘పల్లె ప్రగతి’తో గ్రామాభివృద్ధి
పచ్చదనం, పరిశుభ్రతలో ముందంజ
నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు
గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
అందుబాటులోకి వైకుంఠధామం,కంపోస్టు షెడ్డు
‘మిషన్ భగీరథ’తో తాగునీటి సరఫరా
ఆహ్లాదకరంగా ‘పల్లె ప్రకృతి వనం’
మండలంలోనే అత్యధికంగా కల్లాల ఏర్పాటు
దోమ, సెప్టెంబర్ 3 : ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో అద్భుతంగా మారింది. బడెంపల్లి గ్రామ పరిధిలోని గంజిపల్లి నూతన పంచాయతీగా ఏర్పడింది. దీంతో ప్రత్యేక నిధులతో పాటు ‘పల్లె ప్రగతి’ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. అనుబంధ గ్రామాలు పెద్ద తండా, చిన్న తండాలను కలుపుకొని గ్రామ పరిధిలో 1550 జనాభా, 220 ఇండ్లు ఉన్నాయి. గ్రామ రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. రు.18 లక్షల నిధులతో ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించారు. ప్రతి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు జిగేల్మంటున్నాయి. రూ.14.50 లక్షలతో వైకుంఠధామం, కంపోస్టు షెడ్డులను నిర్మించగా, అందుబాటులోకి వచ్చాయి. పూల మొక్కలు, వివిధ రకాల మొక్కలతో పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా మారింది. ‘మిషన్ భగీరథ’తో సరిపడా తాగునీరు సరఫరా అవుతుండటంతో నీటి కష్టాలు తీరాయి. మండలంలోనే అధికంగా 26 మంది రైతులు పంటల నూర్పిడి కోసం కల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరింత అభివృద్ధికి కృషి చేస్తా..
‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలు మారాయి. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు వేశాం. మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీరాయి. గ్రామాభివృద్ధికి యువత చేయూతనందిస్తున్నారు.
పల్లెంతా పరిశుభ్రం..
ప్రతి రోజు పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. మురుగు కాల్వలు, ఇంటింటి మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామంగా మారింది.
‘పల్లె ప్రగతి’ అద్భుత కార్యక్రమం..
గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ అద్భుత కార్యక్రమం. గ్రామంలో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేయడంతో గ్రామ స్వరూపం మారింది. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉన్నది.
-కలిగెరి వెంకటేశ్, గ్రామ యువకుడు