
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్… ప్రజాభిమానాన్ని చూరగొని తిరుగులేని శక్తిగా ఎదిగింది. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌స్థాయి వరకు ఏ ఎన్నికలొచ్చినా విజయం సాధిస్తూ వస్తున్నది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలే సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కాగా, అధిష్టానం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిని సారించింది. కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆశావహులు, కష్టపడినవారికి పార్టీ పదవులు దక్కనుండటంతో గులాబీ శ్రేణుల్లో సందడి నెలకొన్నది. నేటి నుంచి పతాకస్థాయిలో గులాబీ జెండా పండుగను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో 12వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయి, 20వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల్లో పట్టణ, వాటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం జిల్లా కమిటీనీ ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరుపై విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళికను రూపొందించారు. నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా పండుగ ఘనంగా నిర్వహించాలని మంత్రి సబితారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వికారాబాద్, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ) : పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎదురులేని శక్తిగా నిలువనున్నది. సంస్థాగత పదవుల పండుగ మొదలవుతున్నది. వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 2వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి సంస్థాగత ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే ప్రకటన చేశారు. ఇప్పటికే వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సమావేశం నిర్వహించగా.. మంగళవారం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్‌రెడ్డిలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. జిల్లాలోని 19 మండలాల్లోని 565 గ్రామపంచాయతీలు, నాలుగు నియోజకవర్గాలు, నాలుగు మున్సిపాలిటీల్లో కొత్త కమిటీలను వేయనున్నారు. పార్టీలో కష్టపడిన వారికి, యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.
జిల్లాలో వికారాబాద్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా, కొడంగల్, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వార్డు, గ్రామ, మండల, మున్సిపాలిటీ కమిటీల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టారు. వీటితో పాటు జిల్లాకు అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నది. పార్టీని సమర్థవంతంగా నడుపగలిగే నాయకుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు అధిష్టానం యోచిస్తున్నది. అధ్యక్షుడి ఎంపికలో జిల్లా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్, విద్యా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్‌గౌడ్ ప్రముఖ పాత్రను పోషించనున్నారు. ప్రధానంగా ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతూ ఏ పదవి దక్కనివారితో పాటు నామినేటెడ్ పోస్టులు ఆశించి భంగపడిన వారు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. సామాజిక వర్గ సమీకరణలు కూడా అధ్యక్షుడి ఎంపికలో కీలకం కానున్నాయి.
టీఆర్ఎస్ ఆవిర్భవించి సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 20 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అదే రోజు సంస్థాగత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు వార్డు, గ్రామ కమిటీలు వేయనున్నారు. 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పట్టణ(మున్సిపాలిటీ), మండల కమిటీలు పూర్తి చేస్తారు. 20వ తేదీలోగా జిల్లా అధ్యక్షుడితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ప్రతి కమిటీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ భాగస్వామ్యం 51 శాతం తప్పనిసరిగా ఉండాలి.
గ్రామ కమిటీలో 15 మంది సభ్యులుంటారు. అందులో 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు 11 మందితో అనుబంధ కమిటీలు వేయనున్నారు. రైతు, విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్, కార్మిక విభాగం సోషల్ మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ కూడా గ్రామ, వార్డు, మండల, జిల్లాస్థాయిలో ఉండనున్నాయి. ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ కమిటీలను ఎన్నుకుంటారు. ఎన్నికలను ఇన్చార్జీలు పర్యవేక్షిస్తారు.
సంస్థాగత కమిటీ ఎన్నికల సన్నాహక సమావేశాలను మూడు, నాలుగు రోజుల కింద ప్రారంభించారు. వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. తాండూరు, పరిగి నియోజకవనర్గాల సమావేశాలు ఒకట్రెండు రోజుల్లో నిర్వహించనున్నారు. దసరా నాటికి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ ఇచ్చారు. నేటి నుంచి గ్రామ, మండల, మున్సిపల్ వార్డు కమిటీలు, అనుబంధ కమిటీలను వేయనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో ప్లీనరీ నిర్వహించనున్నారు.
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను కల్వకుర్తి నియోజకవర్గంలోని రెండు, మున్సిపాలిటీలు, ఆరు మండలాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించుకొనేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. ఆయా మండలాల్లో గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేకంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి నూతనంగా గ్రామ, వార్డు కమిటీలు వేస్తాం.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను పాటిస్తాం. టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా జెండా పండుగతో అడుగులు పడనున్నాయి. ఆయా మండలాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించి సంబురాల్లో పాల్గొనాలి. నేడు ఢిల్లీలో పార్టీ భవనం నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పార్టీ జెండా పండుగకు ఏర్పాట్లు చేశాం. వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, పట్టణ అధ్యక్షులతో కొన్ని రోజుల కిందే సమావేశాలు నిర్వహించాం. ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఊరూరా జెండా పండుగ నిర్వహిస్తాం. అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం. తద్వారా పార్టీ మరింత బలోపేతం కానున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ వారధిగా నిలుస్తున్నది.
టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కణ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించుకునేలా కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ మనుగడ సాధ్యం. గ్రామ కమిటీల ఏర్పాటుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ జెండా వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. గ్రామ, మండల, మున్సిపల్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాం. నేడు పార్టీ జెండా పండుగను వైభవంగా నిర్వహిస్తాం.
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడాన్ని పురస్కరించుకొని గురువారం అన్ని గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తున్నాం. షాద్‌నగర్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పలు మండలాల్లో ర్యాలీలు ఉంటాయి.