వరి ధాన్యం కొనుగోళ్లకు ససేమిరా అంటున్న కేంద్రం తీరును నిరసిస్తూ సోమవారం జిల్లాలో గులాబీ దండు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు నిరసనగళం విప్పారు. ‘పంజాబ్లో వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదు?. ఇక్కడి రైతులపై ఎందుకీ వివక్ష’ అంటూ మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నిరసన దీక్షల్లో ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే దాకా అండగా ఉంటామని అన్నదాతలకు భరోసా ఇచ్చారు. మోదీ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయి పుష్కలంగా సాగునీరు వస్తుండడంతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతుండగా చూడలేకపోతున్న కేంద్రం మోకాలడ్డే నిర్ణయాలు తీసుకుంటున్నదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో బీజేపీ నాయకులు వరి వద్దంటే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరిసాగుచేయమని రైతులను రెచ్చగొట్టి ఉసురుతీస్తున్నారని మండిపడ్డారు. ప్లకార్డులు, నల్ల జెండాలతో దీక్షలో మండల, గ్రామ, మున్సిపల్, వార్డు కమిటీల సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులతోపాటు, రాష్ట్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతు బంధు సమితుల ప్రతినిధులు పాల్గొని రైతులకు బాసటగా నిలిచారు.