
కరోనా కేసుల సంఖ్య కలవర పెడుతున్నది. వారం రోజులుగా పాజిటివ్ రేటు పెరుగుతున్నది. జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందు రోజుకు సగటున 28 కేసులు నమోదు కాగా ప్రస్తుతం రెండు వందలకు చేరింది. అయితే, చాలా మంది బాధితుల్లో సాధారణ లక్షణాలే కనిపించడం ఊరట కలిగిస్తున్నది. బాధితుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులే ప్రధానంగా కనిపిస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వారు వారం రోజుల్లోపే కోలుకుంటున్నారు. వాస్తవానికి కరోనా మొదటి, రెండో దశలో విజృభించి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది బాధితులు దవాఖానలో చేరే తీవ్ర పరిస్థితి రావడం లేదు. జిల్లాలో రోజుకు సగటున మూడు వేలకు పైగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నా మూడు రోజులుగా 200 పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 62,757 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. కేవలం 40 మంది మాత్రమే దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారందరూ హోం ఐసొలేషన్‌లోనే ఉన్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు ప్రభుత్వం వ్యాక్సిన్‌తో అడుకట్ట వేస్తున్నది. ప్రజలందరికీ వ్యాక్సిన్వేస్తుండడంతో ప్రస్తుతం ఊరట పొందుతున్నారు. పాజిటివ్ కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నా తీవ్రత తక్కువగానే ఉంటుంది. సంక్రాంతి పండుగ తరువాత వైరస్ వ్యాప్తి మరింత పెరిగినా ప్రభావం మాత్రం తక్కువగా ఉన్నది. వైరస్ బాధితులు సాధారణ జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,952 కేసులు యాక్టివ్‌లో ఉన్నప్పటికీ కేవలం 40 మంది మాత్రమే దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా హోం ఐసొలేషన్‌లో కోలుకుంటున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారు కూడా కేవలం రెండు మూడ్రోజుల్లోనే ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వెళ్తున్నారని వైద్యులు చెప్తున్నారు. వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, శ్వాస సమస్యలు పెద్దగా కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు.
వ్యాక్సిన్‌తో…
కరోనా మూడో దశ నాటికి జిల్లాలో వందశాతానికి పైగా మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. రెండో డోసు సైతం 80శాతం పూర్తి కాగా ప్రస్తుతం 15 నుంచి 18 ఏండ్ల యువతకు టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు కరోనా దాడి చేస్తున్నా ముప్పు తక్కువగా ఉన్నదని వైద్యులు చెప్తున్నారు. టీకా వేసుకోవడంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగిందని, అందుకే బాధితులు దవాఖానకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు.
జాగ్రత్తలతో వైరస్‌కు అడ్డుకట్ట..
అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడంతో పాటు ఇల్లు విడిచి బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శానిటైజర్ ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కొవిడ్ నిబంధనలు నిర్లక్ష్యం చేస్తే మరింతగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మారుమూల పల్లెలతో పాటు పట్టణాల్లోనూ బాధితులు పెరుగుతున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఒకరి నుంచి మరొకరికి రాకుండా నియంత్రించాలంటే కొవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా బాధితుల్లో కొందరు కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మరికొందరు లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. తనతోపాటు కుటుంబ సభ్యులకు సోకేందుకు కారణం అవుతున్నారు.
ఆందోళన అవసరం లేదు..
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ బారిన పడిన వారికోసం 40వేల మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాలి. యువతకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. రెండు డోసులు పూర్తయి 9నెలలు గడిచిన వారంతా బూస్టర్ డోసు వేసుకోవాలి. రెండు డోసుల కొవిడ్ టీకా థర్డ్ వేవ్ ముప్పును తప్పిస్తుంది. జిల్లాలో థర్డ్‌వేవ్‌లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చు.