సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 7 : ఎన్ని ఉన్నత చదవులు చదివినా పొందలేని హోదా, ప్రారంభంలోనే సుమారు రూ.40 వేల జీతం పొందేందుకు రాచమార్గం లాంటి అవకాశాన్ని కంపెనీ సెక్రటరీ కోర్సు కల్పిస్తుందని ఐసీఎస్ఐ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా)హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజమొగిలి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కోర్సును వయస్సుతో సంబంధం లేకుండా పూర్తి చేయవచ్చని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి మంచి జీతం, కార్పొరేట్ ఉద్యోగం, హోదాతోపాటు అనేక రకాల సదుపాయాలు ఉంటాయని చెప్పారు. ఈ కోర్సును కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లభించే ఏకైక కోర్సు కంపెనీ సెక్రటరీ అని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ కోర్సు పూర్తి చేసిన వారు లేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కంపెనీల చట్టం ప్రకారం ప్రతి రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీ తప్పనిసరిగా ఒక కంపెనీ సెక్రటరీని నియమించుకోవాల్సి ఉందని, కానీ ప్రస్తుతం 2 లక్షల కంపెనీల్లో 50 వేల కంపెనీలు మాత్రమే కంపెనీ సెక్రటరీలను నియమించుకున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తి చేసి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రారంభంలోనే రూ.లక్ష ఉంటుందన్నారు. ఏ కోర్సుతో సంబంధం లేకుండా బీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ కోర్సు చేసేందుకు అర్హులని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హత పరీక్ష ద్వారా కోర్సులో చేరవచ్చని, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు నేరుగా ఈ కోర్సులో చేరేందుకు అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. కోర్సులో ప్రవేశం పొందిన అభ్యర్థులకు పాఠ్యపుస్తకాలను కూడా అందించడంతోపాటు సలహాలు, సూచనలు అందించనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ, భవిత, సాయిగౌతమి, శ్రీమేధ, శ్రీనిధి, సాక్షిశ్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాజమొగిలి సమాధానాలు చెప్పారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ వైస్ చైర్మన్ లలితకుమారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ బీఎం తొవిటి మహేందర్, సూర్యాపేట స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్‌గుప్తా, సర్క్యులేషన్ మేనేజర్ గణేశ్, రిపోర్టర్లు వేణుగోపాల్, సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
కంపెనీ చట్టాల ప్రకారం ప్రతి కంపెనీ సెక్రటరీలను నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ కంపెనీలు సెక్రటరీలను నియమించుకునేందుకు అర్హులు లేరని రాజమొగిలి తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కచ్చితంగా ఉద్యోగం లభిస్తుందన్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్సు కోసం రూ.35 వేలు ఖర్చవుతుందని, దానిని కోర్సు పూర్తిచేసిన అనంతరం నెలలోనే పొందే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు రాయితోపాటు ఆర్మీ కుటుంబాలకు చెందిన వారు ఫీజు పూర్తిగా తిరిగి పొందే అవకాశం ఉందని వివరించారు.
ఈ కోర్సును ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అనంతరం కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రెన్స్ ద్వారా ఇందులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతుల్లో కోర్సు పూర్తి చేయవచ్చు. తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన నామమాత్రపు ఫీజును అభ్యర్థులు చెల్లించి అడ్మిషన్ పొందవచ్చు. పూర్తి చేసిన అభ్యర్థులకు ఐసీఎస్ఐ సభ్యత్వం లభిస్తుంది. ఆ తర్వాత కంపెనీ సెక్రటరీగా లేదా సొంతంగా ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
చదువు పూర్తిచేయగానే జాబ్ లభించే కంపెనీ సెక్రటరీ కోర్సు ఉందని ఇంతవరకు నాకు తెలియదు. ఇందులో ఉన్న అవకాశాలు చెబుతుంటే ఎలాగైనా కోర్సు చేయాలని అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాలాంటి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారికి ఈ విషయంపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉంది.
– ఊర అనిల్, ప్రతిభ జూనియర్ కళాశాల, సూర్యాపేట
ప్రస్తుతం ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలకే రూ.40-50 వేల ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ నామమాత్రపు ఫీజుతో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన అనంతరం రూ.లక్షలు సంపాదించే అవకావం ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ వారికి ఫీజులో రాయితీ కల్పించడంతో ఎక్కువ మంది అసక్తిని చూపించే అవకాశం ఉంటుంది.
– సాయితేజ, భవిత జూనియర్
ఈ కోర్సు పూర్తిచేసిన వారు చిన్న వయస్సులోనే పెద్ద పదవి అయిన కంపెనీ సెక్రటరీగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఈ కోర్సు పూర్తయితే హోదాతోపాటు మంచి జీతం పొందవచ్చని నాకు అర్థమైంది. ఈ కోర్సుపై అవగాహన కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు ధన్యవాదాలు. కోర్సు గురించి వివరించిన వారికి అభినందనలు.
– లక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట
కంపెనీ సెక్రటరీ కోర్సు గురించి నాకు పూర్తి అవగాహన కలిగింది. అవగాహన కల్పించిన నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ కోర్సు పూర్తిచేస్తే తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉందని తెలిసింది. మా ఇంట్లో చెప్పి ఈ కోర్సు చేసేందుకు సన్నద్ధమవుతా.
– ఝాన్సీ, శ్రీమేధ జూనియర్ కళాశాల, సూర్యాపేట