
గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పల్లకీ సేవలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి గురువారం వైభవంగా జరిగింది. వైష్ణవాలయాల్లో గోవింద నామస్మరణ మార్మోగింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని తరించారు. చలిని సైతం లెక్కచేయకుండా వేకువజామునే ఆలయాల ఎదుట క్యూ కట్టారు. స్వామిని దర్శించుకొని తన్మయత్వం చెందారు. ఉదయం 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, సంగీత విభావరి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆయా చోట్ల ప్రముఖులు దర్శించుకొని, పూజలు చేశారు.