నల్లగొండ, ఏప్రిల్ 1 : గిరిజన రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి లేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ విమర్శించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 50శాతం రిజర్వేషన్ల కంటే ఎక్కువ అమలు చేయవద్దని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో పద్ధతిలో గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని 2017లో అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేలుగా అదే అసెంబ్లీలో ఉన్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. పైగా 9.8శాతం ఎస్టీలు ఉంటే పది శాతం పంపడం ఎందుకని, అది కూడా మైనార్టీల బిల్లుతో కలిపి ఎందుకు పంపారని మాట్లాడటంలో అర్థం ఉన్నదా అని మండిపడ్డారు. అసెంబ్లీ తీర్మానాన్ని మరిచిన కిషన్‌రెడ్డి, ఉత్తమ్ ఎస్టీ రిజర్వేషన్లు టీఆర్ఎస్ ఎందుకు చేస్తలేదనడం ఎంత వరకు సమంజసమన్నారు. కేంద్ర మంత్రుల్లో కొందరు పార్లమెంటుకు తీర్మానం పంపలేదని, రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చని ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడాన్ని ఆయన తప్పుబట్టారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభు త్వం పంపిన తీర్మానానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను రాత పూర్వకంగా అందచేస్తే రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు అమలు చేస్తదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో గిరిజనులకు ఏం చేసిందో తెలుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికీ రూ.25లక్షలు మంజూరు చేసిందని, మిషన్ భగీరథ నీళ్లు, సీసీ రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. సమావేశంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు.