ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం
‘పల్లె ప్రగతి’ నిర్మాణాలతో మారిన రూపురేఖలు
అభివృద్ధి పనుల్లో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి
కార్యక్రమం వల్ల మాడ్గులపల్లి మండలంలోని ఆగామోత్కూర్ గ్రామం అభివృద్ధి పథంలో
పయనిస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులతో మౌలిక వసతులు కల్పించారు. పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ గతేడాది ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నది.
హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామం పచ్చదనంతో విలసిల్లుతున్నది. పల్లెప్రకృతి వనంలో పెరిగిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని ప్రధాన రోడ్లతో పాటు కాలనీల్లో అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటడంతో వీధులన్నీ హరిత శోభను సంతరించకున్నాయి. రోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు.
పారిశుధ్య పనులకు పెద్దపీట..
పల్లె ప్రగతి అమలులోకి వచ్చాక పారిశుధ్య పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. పంచాయతీ కార్మికులు డ్రైనేజీల్లోని పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పిచ్చి మొక్కల తొలగింపు, మురికి కాల్వలను పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తుండడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గింది.
పల్లె ప్రగతి పనులతో సకల సౌకర్యాలు..
గ్రామంలో గతంలో ఎవరైనా మృతిచెందితే దహన సంస్కారాలు చేసేందుకు శ్మశాన వాటికలేక ఇబ్బందులు పడ్డారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రూ.12లక్షలతో వైకుంఠ ధామం నిర్మించారు. మరుగు దొడ్లు, స్నానపు గదులు, ప్రాంగణంలో మొక్కలతో తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి పనులు సకాలంలో పూర్తి చేసి గ్రామాన్ని తీర్చిదిద్దడంతో గతేడాది ఆదర్శ గ్రామంగా అవార్డు దక్కింది.
పల్లె ప్రగతితో గ్రామ స్వరూపం మారింది..
ప్రతి ఊరూ అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నాం. సీసీ రోడ్లు, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం పనులతో గ్రామ స్వరూపం మారిపోయింది.