బొడ్రాయిబజార్, ఏప్రిల్ 7 : దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఈ-నామ్ విధానంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సేవలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ మార్కెటింగ్బోర్డు అడిషనల్ డైరెక్టర్ నిధి శ్రీవత్సవ్ అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలువుతున్న ఈ-నామ్ పద్ధతులను తెలుసుకునేందుకు గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను ఆ రాష్ట్ర ఏపీఎంసీ సెక్రటరీ శ్రీఫంకజ్శర్మ, సిస్టం ఎనలిస్ట్ సత్యేంద్రకుమార్ తివారీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ నిధి శ్రీవత్సవ్ మాట్లాడుతూ ఈనామ్ విధానంలో రైతులకు గేట్ ఎంట్రీ మొదలుకొని నాలుగు సెగ్మెంట్లుగా విభజించి సెగ్మెంట్‌కు ఒక ఇన్చార్జి, సబ్ స్టాఫ్‌ను నియమించి రైతులకు అసైన్డ్ చేసే విధానం బాగుందన్నారు. ఈ సేవలతో రైతు మార్కెట్‌కు ధాన్యం తెచ్చిన రోజునే చెల్లింపులు కూడా జరిగిపోవడంతో రైతులకు సమయం అదా అవుతుందన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులు, కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో మాట్లాడారు. ఈ-నామ్లో భాగంగా గేట్ ఎంట్రీ, బిడ్డింగ్, బిడ్ డిక్లరేషన్లు క్షుణంగా పరిశీలించి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియొద్దీన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు పలువురు రైతులను ఈ-నామ్ విధానంపై ప్రశ్నించగా గతంలో ధాన్యం విక్రయించాలంటే రెండు, మూడు రోజులు పట్టేదని ఇప్పుడు ఒకేరోజులో చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈ-నామ్ సౌత్ ఇండియా హెడ్ చంద్రశేఖర్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.మల్లేశ్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అజ్మీరారాజ్, టీఎంఓ సంతోష్, మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత, యూడీసీ ఖాసీం, సూపర్వైజర్స్ శ్రావణ్, సమ్మీ పాల్గొన్నారు.