సూర్యాపేట, ఆగస్టు 11 : పసికందుల పాలిట మహమ్మారి న్యుమోనియాను తరిమేందుకు కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఏటా 12లక్షల శిశు మరణాలు నమోదవుతుంటే అందులో న్యుమోనియా బాధితులు 2లక్షలకు పైమాటే. ఈ నేపథ్యంలో న్యుమోనియా నివారణకు న్యుమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)చిన్నారులకు వేయనున్నారు. రూ.4వేల విలువైన ఈ టీకాను నేడు హైదరాబాద్‌లో ప్రారంభించనుండగా త్వరలోనే వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. ఇప్పటికే 1,250 టీకాలు సూర్యాపేట జిల్లాకు చేరుకున్నాయి. ఈ మేరకు అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు మంగళవారం వైద్యారోగ్యశాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీతో సమావేశమై వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బంది సహకారంతో చిన్నారుల వివరాలను సేకరించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. టీకాపై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలన్నారు. దేశంలో 1985సంవత్సరం నాటికి చిన్నారులకు వివిధ జబ్బుల బారి నుంచి కాపాడేందుకు కేవలం 6టీకాలు ఉండేవి. 2021నాటికి ఆసంఖ్య 11కాగా, తాజాగా న్యుమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌తో 12కు చేరింది. మన దేశంలో ఐదేండ్ల వయస్సు లోపు చిన్నారులు పలు రుగ్మతలతో ఏటా 12 లక్షల మంది కన్నుమూస్తున్నారు. ఇందులో న్యుమోనియా బాధితులు 2లక్షలు అంటే 16శాతం మంది ఉన్నారు. టీకా వేయించడం వల్ల 16శాతం మరణాలను తగ్గించవచ్చు. ప్రస్తుతం ప్రైవేటులో టీకా విలువ రూ.4వేలు పలుకుతున్నది.
రాష్ట్రంలో నేడు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా జిల్లాలో ఈ నెల 14న లేదా 18న అందించనున్నారు. సూర్యాపేట జిల్లాలో ఏటా 16వేల మంది చిన్నారులు జన్మిస్తున్నారు. ఆయా లెక్కల ఆధారంగా ప్రస్తుతం 1,250 డోసులు జిల్లాకు చేరాయి. ఆరు వారాల వయస్సున్న చిన్నారులకు మొదటి డోసు, 14వారాలకు రెండో డోసు, తొమ్మిది నెలలకు బూస్టర్ డోసు వేస్తారు.