సూర్యాపేట, ఆగస్టు 9 : రాష్ట్ర ప్రభుత్వం హెయిర్ సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీ దుకాణాలకు ఉచితంగా అందించే 250 యూనిట్ల కరెంటును అర్హులైన లబ్ధిదారులందరికీ అందించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నాయీ బ్రాహ్మణ, రజక కుల సంఘాల నాయకులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, కుల సంఘాలు ప్రత్యేక శ్రద్ధ్ద చూపి దుకాణం యజమాని లబ్ధ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రజక కులస్తుల నుంచి 487 దరఖాస్తులు, నాయీ బ్రాహ్మణుల నుంచి 400 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. గ్రామ, మండలాల్లో అవగాహన కల్పించాలన్నారు. పాత కనెక్షన్ ఉన్నవారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సూర్యాపేట : సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు భరోసా కల్పించాలని, ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజవాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. మండలాల నుంచి ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని మండల స్థాయి అధికారులు వెం టనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజావాణిలో 89 వినతులు రాగా అత్యధికంగా 83 ఫిర్యాదులు భూ సమస్యలపైనే వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, ఇన్చార్జి డీఆర్వో రాజేంద్రకుమార్, డీఆర్డీఓ సుందరి కిరణ్కుమార్, ఐసీడీఎస్ పీడీ నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.