ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్న బోరు బండి ఇది. ఈ ప్రమాదంలో బోరు బండి డ్రైవర్‌తోపాటు బస్సులోని 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వేలల్లో వాహనాల రాకపోకలు ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సాక్షాత్తూ కలెక్టర్ నివాసం ఎదుట ఈ ప్రమాదకర ప్రయాణాలు నిత్యకృత్యమయ్యాయి. ఇక్కడి పార్కింగ్ అడ్డా నుంచి జనగాం రోడ్డు వైపు వెళ్లాల్సిన బోరు బండ్లు కొత్త బస్టాండ్ అండర్ పాస్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. కానీ, దూరమవుతుందనే ఉద్దేశంతో కొందరు డ్రైవర్లు రాంగ్ రూట్లో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ఎదురుగా వెళ్తున్నారు. అలా జరిగిందే ఈ ప్రమాదం. అధికారులు
ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
సూర్యాపేట సిటీ, ఆగస్టు 9 : బోరుబండి రాంగ్రూట్లో వచ్చి బస్సును ఢీ కొట్టడంతో 17 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్ హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బోరు బండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి గాయాలయ్యాయి. బోరుబండి డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.