భారీ వర్షాలు, ముసురుతో ఎంతో చల్లగా ఉండాల్సిన అసలేరు కార్తెలో ఎండలు భగ్గుమంటున్నాయి. వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా 24 నుంచి 25 డిగ్రీల వరకూ ఉంటున్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతకు జనం అల్లాడుతున్నారు. ఇండ్లల్లో కూలర్లు, ఏసీలు వేసుకుంటున్నారు. గత రెండు నెలల మంచి వానలు పడ్డా, జూలై 25 తర్వాత వరుణుడి జాడ లేకపోవడంతో పత్తి, కంది పైర్లు కూడా వాడుమొహం పడుతున్నాయి. పెసర పంట చేతికొచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలేరు వస్తే బురదతో లసలసే అని విన్నాం గానీ, ఇవేం ఎండలంటూ పల్లె జనం చెప్పుకొంటున్నారు.
సూర్యాపేట, ఆగస్టు 9 : వేసవిలో ఎండల వేడికి ప్రజలు అల్లాడిపోయారు. వానకాలం వచ్చి రెండు నెలలు మంచి వర్షాలు కురిశాయి. కానీ జూలై 25 నుంచి ఇప్పటి వరకు వర్షం లేకపోగా ఉదయం 8 గంటల నుంచి ఎండతో పాటు ఉక్కపోతకు ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతులు తెలుగు కార్తెల ప్రకారం వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం అసలేరు(ఆశ్లేష) కార్తె నడుస్తున్నది. వాస్తవానికి వర్షాలు బాగా పడుతు టాయి. ‘అసలేరు వస్తుంది ఇక బురదతో లసలసే అంటూ’ సామెతలు చెప్పుకుంటారు. గొర్రెల కాపరులు గుట్టలు, ఎత్తయిన ప్రదేశాల వద్ద వాటిని ఉంచుతారు. కానీ ఇందుకు భిన్నంగా అసలేరులో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో రోజు సగటున 34 నుంచి 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 24 నుంచి 25 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఏసీ, కూలర్లు వినియోగిస్తున్నారు.
ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో మంచి వర్షాలు కురిశాయి. జూన్లో సాధారణ వర్షపాతం 93.7 మిల్లీ మీటర్లు ఉండగా 133 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జూలైలో 196.69 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా 271.3 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జూన్ నెలలో సగటున మెత్తం వర్షం పడగా, జూలైలో సగటున 17 రోజుల పాటు వర్షం పడింది. జూలై 25 నుంచి ఆగస్టు 9 వరకు అంటే సుమారు 15 రోజులకు పైగా జిల్లాలో మంచి వర్షాలు లేవు. చిరు జల్లులు కురిసిన 10 మిల్లీ మీటర్లకు తక్కువే.
వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో సరైన వర్షాలు లేక పెసర కాయలు కాయడం లేదని రైతులు వాపోతున్నారు. పత్తి, కంది పంటలు సైతం ఎండలకు వాడి పోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో కాళేశ్వరం, కృష్ణా, మూసీ కాల్వల ద్వారా కొందరు రైతులు పంటలు వాడి పోకుండా నీరు పెట్టుకుంటున్నారు.