చెస్ క్రీడలో ఉమ్మడి జిల్లా ఆణిముత్యం మేకల అభినవ్. తొమ్మిదేండ్ల వయస్సుల్లో ఆసియా చాంపియన్‌గా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ క్రమంలో ఎన్నో జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి.. చెస్ చిచ్చరపిడుగుగా పేరొందిన అభినవ్ పదేండ్లకే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. నేడు అభినవ్ వర్ధంతి సందర్భంగా ఓ సారి స్మరించుకుంటూ ఈ కథనం..
కోదాడ రూరల్, సెప్టెంబర్ 22 : నడిగూడెం మండలం కేశవాపురంలో సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉపాధ్యాయుడు మేకల వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమారుడు అభినవ్ చిన్ననాటి నుండే ‘చదరంగం’ పై మమకారం పెంచుకున్నాడు. 1990 జూన్ 23న జన్మించిన అభినవ్ నవంబర్ 1997నాటికి అండర్ 8 ‘తెలంగాణ ఛాంపియన్షిప్’ సాధించడం విశేషం. స్థానికంగా చెన్నయ్య, డా.అశోక్‌కుమార్, పార్ధసారధి వద్ద శిక్షణ పొంది 1997లో గుజరాత్లో జరిగిన అండర్ 7 ఛాంపియన్‌షిప్‌లో జాతీయ స్థాయిలో 18వ స్థానం, 1998లో అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో 16వ స్థానం సాధించాడు. 1999లో జిల్లా ఓపెన్ ఛాంపియన్షిప్, 1999లో ఔరంగాబాద్‌లో జరిగిన అండర్ 9 జాతీయ పోటీల్లో ద్వితీయ స్థానం, 2000లో టెహరాన్‌లో జరిగిన ‘అండర్ 10 ఆసియా ఛాంపియన్ షిప్’ సాధించాడు. దాంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించుకొని అభినందించగా, ఎందరో ప్రముఖులు అభినవ్ ఇంటికి వెళ్లి సన్మానించడం విశేషం.
క్రీడాచరిత్రలో విషాదదినం….
అనేక అంతర్జాతీయ పోటీల్లో అసమాన ప్రతిభను చాటి గ్రాండ్‌మాస్టర్ కావాలనే లక్ష్యంతో ఒడిశాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తూ 2001 సెప్టెంబర్ 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో అభినవ్ కన్నుమూశాడు.
అభినవ్ స్ఫూర్తితో చెస్ క్రీడలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు 50 మంది ప్రముఖులతో ‘మేకల అభినవ్ ట్రస్ట్’ ఏర్పాటైంది. ప్రభుత్వం ట్రస్ట్‌కు గుర్తింపు నివ్వడంతో పాటు దాతలకు ఆదాయపన్ను మినహాయింపు కల్పించింది. మరోవైపు కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ముఖద్వారం పక్కన అభినవ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. పాఠశాల లోపల అభినవ్ పేర ఇండోర్ ఆడిటోరియాన్ని నిర్మించారు. నయానగర్ ప్రధాన రహదారికి అభినవ్ రోడ్‌గా నామకరణం చేశారు. జిల్లా కేంద్రంలో స్టేడియానికి మేకల అభినవ్‌గా నామకరణం చేశారు.
అభినవ్ జీవితగాథపై పుస్తకావిష్కరణ…
నడిగూడెం మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త బడుగుల నాగరాజు యాదవ్ మేకల అభినవ్ జీవితాన్ని పుస్తక రూపంలోకి తీసుకు వచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా అభివన్ విగ్రహం వద్ద పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
వడివడిగా దూసుకెళ్లిన అభినవ్..