మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
జిల్లా రాఖీ పౌర్ణమి వేడుకలు
సూర్యాపేట టౌన్, ఆగస్టు 22 : సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెళ్ల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాఖీ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. ఆడబిడ్డల గ్రామాల్లో సందడి నెలకొంది. స్వీట్ షాపులు, రాఖీ విక్రయ కేంద్రాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. రాఖీ పండుగ మన సంస్కృతి, సంప్రదాయక వేడుక అన్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్ల మధ్య అనురాగాలు, అనుబంధాలు పంచే ప్రత్యేక పండుగ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి కరోనా పూర్తిగా అంతరించిపోయి అన్ని పండుగలను కలిసిమెలిసి మరింత సంబురంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డికి మహిళా ప్రజాప్రతినిధులు, చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మంత్రికి వరుసకు సోదరి అయిన కడారి సరళాదేవి రాఖీ కట్టి స్వీటు తినిపించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు పెరుమాళ్ల అన్నపూర్ణ, ఉప్పల లలితాఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ సల్మా మస్తాన్‌తోపాటు పలువురు మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, అనిల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.