రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్
సూర్యాపేటలో లాంఛనంగా ప్రారంభం
లబ్ధిదారులకు మీటర్, మెయిన్, స్విచ్‌లు,
వైర్ల పంపిణీకార్యరూపం దాల్చిన
సీఎం కేసీఆర్ హామీఉమ్మడి జిల్లా నుంచి 3,517 దరఖాస్తులు
తరాల తరబడి కులవృత్తినే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్న వేలాది బడుగులకు ఇన్నాళ్లకో భరోసా లభించింది. సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రజకులు, నాయీబ్రాహ్మణులకు కేసీఆర్ సర్కారు చేయూతనందిస్తున్నది. సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ కార్యరూపం దాల్చింది. ఈ నెల నుంచే అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడమే గాక లబ్ధిదారులకు రూ.6వేల విలువ చేసే విద్యుత్ సామగ్రిని అందిస్తున్నది. ఆ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం సూర్యాపేటలో లబ్ధిదారులకు విద్యుత్ మీటర్లు, మెయిన్లు, స్విచ్‌లు, వైర్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,517 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, తొలి విడుతలో సూర్యాపేట జిల్లాలో 771 మందిని అర్హులను ఎంపిక చేశారు.
సెలూన్లు, లాండ్రీలకు 250యూనిట్ల విద్యుత్ ఫ్రీ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,517మందికి లబ్ధి
నాయీబ్రాహ్మణ, రజక కుటుంబాల్లో
ఆనందోత్సాహాలు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట జిల్లాలో మీటర్లు అందజేత
సూర్యాపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వృత్తిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొంటున్నాయి. చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులు, గొర్రెల యూనిట్ల మంజూరుతో గొల్ల, కుర్మలు ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించగా.. తాజాగా నాయీ బ్రాహ్మణ, రజక కుటుంబాలకు మేలు జరిగేలా ఉచిత విద్యుత్ పథకానికి అడుగులు పడ్డాయి. దయనీయంగా మారిన ఆయా కుటుంబాలకు ఊరటనిచ్చేలా ఉచిత విద్యుత్‌తో పాటు సామగ్రిని సైతం అందించనున్నది. ఈ మేరకు శనివారం సూర్యాపేట నియోకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు విద్యుత్ మీటర్లు, స్విచ్‌లు, వైరు సామగ్రిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థికంగా
మెరుగుపడాలని సూచించారు.
హెయిర్ కటింగ్ సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, ఇస్త్రీ, డ్రైక్లీనింగ్ చేసే రజక వృత్తిదారులకు నెలకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వర్తించనున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,517మంది ఉచిత విద్యుత్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో తొలి విడుతలో భాగంగా రజకులు 552, నాయీ బ్రాహ్మణులు 223మందిని గుర్తించారు. నల్లగొండ జిల్లాలో రజకులు 841, నాయీ బ్రాహ్మణులు 810, యాదాద్రి భువనగిరి జిల్లాలో రజకులు 443మంది, 418నాయీ బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకున్నారు.
రూ.6వేల సామగ్రి, నెలకు 250యూనిట్లు ఉచితం
లబ్ధిదారులకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు రూ.6వేల విలువైన మెటీరియల్‌ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. సామగ్రిలో ఒక్కో లబ్ధిదారుడికి మీటరు, రెండు స్విచ్‌లు, విద్యుత్ బల్బు, మెయిన్, బోర్డు, వైరు అందిస్తున్నారు. భార్య, భర్త వేర్వేరుగా పనిచేస్తుంటే ఇరువురికీ ఉచిత విద్యుత్ ద్వారా దాదాపు రూ.2500 నుంచి 3వేల వరకు లబ్ధి కలుగనుంది.
రజకులకు ప్రభుత్వం ప్రాధాన్యం
రజకుల సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నది. రజకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు 150యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వమని కోరితే 250యూనిట్లు మంజూరు చేయడం గొప్ప విషయం. వృత్తిదారుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఇట్టే తెలిసిపోతుంది. భవిష్యత్‌లో స్ట్రీమ్ ఐరన్ టేబుల్, ఇస్త్రీ పెట్టె అందించే ఆలోచన చేస్తున్నారు. కమర్షియల్ కేటగిరీ 2ఏ కింద లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. విద్యుత్‌తో పాటు మీటర్లు కూడా ఉచితంగా ఇవ్వడం సంతోషదాయకం.
ఉచిత విద్యుత్‌తో ఎంతో మేలు..
ప్రభుత్వం సెలూన్లకు ఉచిత కరంట్ ఇవ్వడం చాలా సంతోషకరం. సెలూన్ల నిర్వహణలో కరెంటు బిల్లు చాలా భారంగా మారింది. వచ్చిన ఆదాయంలో సగం విద్యుత్ బిల్లులకే చెల్లించాల్సి వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సుతో స్పందించడం గొప్ప విషయం. ప్రభుత్వం 250యూనిట్ల విద్యుత్, రూ.6వేల సామగ్రిని ఫ్రీగా ఇవ్వడంతో పాటు మీటరు కూడా విద్యుత్ సిబ్బందే వచ్చి ఉచితంగా బిగిస్తామని చెప్పారు.
వృత్తిదారులను గుర్తిస్తున్న మహనీయుడు కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తిదారుల మనసెరిగి వారి సమస్యలు ముందుగానే తెలుసుకొని పరిష్కరించడం ఆనందంగా ఉంది. రోజు రోజుకూ అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రోత్సహిస్తున్నారు. రజకులకు కరెంట్‌తో పాటు సామగ్రిని కూడా ఉచితంగా అందించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఉచిత కరెంట్‌తో భరోసా..
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగలి దుకాణాలకు ఉచిత కరెంట్ ఇచ్చి వృత్తిదారులను ప్రోత్సహించడం మాకెంతో భరోసానిచ్చింది. ప్రస్తుతం కరోనా సమయంలో దుకాణాలు నడువక, ఇల్లు గడిచేదే కష్టంగా మారిన సమయంలో కరంట్ బిల్లులు, షాపు అద్దెలు కట్టడం తలకు మించిన భారం. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మాకు ఉచితంగా కరెంట్ అందించడమే కాకుండా సామగ్రిని కూడా అందించడం చాలా సంతోషంగా ఉంది. మా వృత్తి దారులమంతా రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
నాయీ బ్రాహ్మణుల పాలిట దేవుడు కేసీఆర్…
అన్ని వృత్తులను సమానంగా ప్రోత్సహిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా మా పాలిట దేవుడు. గత పాలకులు ఎవరూ కుల వృత్తులను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తిదారుల సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా వృత్తిదారులంతా షాపు అద్దెలు, కరెంట్ బిల్లులు కట్టలేక వేరే పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎంతో చేయూతనిస్తుంది.
ఉచిత విద్యుత్‌తో ఎంతో లబ్ధి..
నేను 14సంవత్సరాల పాటు ప్రైవేట్ టీచర్‌గా పని చేశాను. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూత పడడంతో ఏడాదిన్నరగా కుల వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అధునాతన మిషన్లు రావడంతో మంగలి వృత్తి దారులకు ఆదాయం తగ్గుతున్నది. ఈ సమయంలో కరెంట్ బిల్లు, షాపు అద్దెల కోసం ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను గుర్తించి కేసీఆర్ ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రూ.6వేల విలువ చేసే సామగ్రి కూడా ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషం.