అనుబంధాల వేడుకకు అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్లు రెడీ అయ్యారు. ఆదివారం రాఖీ పండుగ జరుపుకోవడం కోసం ముందే స్వీట్లు, రాఖీలు కొనుగోలు చేశారు. గతేడాదితో పోల్చితే కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఎక్కువమంది ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్లి అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జీవన ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
జాతీయ జీవన ఔన్నత్యానికి రక్షాబంధన్ ప్రతీక
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రక్షాబంధన్ మహోత్సవం జాతీయ జీవన ఔన్నత్యానికి చక్కటి ప్రతీక లాంటిదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి పర్వదినాన్ని జరుపుకోబోతున్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రక్త సంబంధాన్ని మరింత దృఢంగా మలిచి సోదర సోదరీమణుల మధ్య మమతానురాగాలను పెంపొందించేదే రాఖీ పౌర్ణమి అని తెలిపారు. ఆడ పడుచుల అన్యోన్యతకు అద్దం పట్టనున్న రక్షాబంధన్ మహోత్సవాన్ని సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రామగిరి/నేరేడుచర్ల/బొడ్రాయి బజార్, ఆగస్టు 21 : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల సోదర ప్రేమకు ప్రతీక, ఆత్మీయ అనురాగాల వేడుక ‘రాఖీ’. ఈ పండుగను ఆదివారం దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. సోదరి కట్టే రాఖీ ఇరువురి బంధాన్ని మరింత బలపరుస్తుందని విశ్వాసం. ఒకరి శ్రేయస్సును మరొకరు కాంక్షిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకునే ఈ సంస్కృతి తరతరాలుగా కొనసాగుతున్నది. కొవిడ్ నేపథ్యంలో రాఖీ వేడుక రూపుమారింది. చాలా మంది తమ సోదరులకు రాఖీలను ఆన్లైన్లో పంపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మలోని ప్రేమను, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షా బంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోబుట్టిన వాళ్లకు కట్టే రాఖీతో తమ పేగు బంధం కలకాలం నిలువాలని అక్కా చెల్లెళ్ల్లంతా ఆశిస్తారు. అన్న, తమ్ముడి నోరు తీపి చేసి వారంతా జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ఇలా ఇరువురి ఆత్మీయ బంధానికి రాఖీ పండుగ ఒక వారధిలా నిలుస్తున్నది.
విశ్వజనీన స్ఫూర్తి
రాఖీ బంధం కేవలం సోదర, సోదరీమణుల మధ్యే గాకుండా మానవీయతతో కూడిన కరుణాంతరంగ వేడుకగా జరుపుకోవాలి. ఇదే విషయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు నిచ్చారు. హిందువులు, ముస్లింల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి రక్షా బంధన్ ఉత్సవాన్ని జరుపుకోవడంతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
దుకాణాలు కిటకిట
ఓవైపు శుభకార్యాలు, మరోవైపు రాఖీ పండుగతో పట్టణాల్లో జనం రద్దీ నెలకొన్నది. వ్యాపార సముదాయాలు, కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఆడ పడుచులు తమ సోదరులకు రాఖీలు కొనుగోలు చేశారు. రాఖీ, స్వీట్ విక్రయాల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. రోడ్ల వెంట తాత్కాలికంగా టెంట్లు వేసుకొని విక్రయించారు. గతేడాదితో పోలిస్తే రాఖీల ధరలు పెరిగాయని వర్తకులు వెల్లడించారు.
జంధ్యాల పౌర్ణమిగా..
శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. ఈ రోజున యజ్ఞోపవీత ధారణ చేసుకుంటారు. విశ్వబ్రాహ్మణ, బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలీలు తదితర సామాజిక వర్గాల వారు యజ్ఞోపవీతాలను మార్చుకుంటారు.