నిర్లక్ష్యంగా నడిపితే బోల్తా పడే ప్రమాదం
పొలం దున్నేటప్పుడు అప్రమత్తత అవసరం
మారుతున్న కాలానికి అనుగుణంగా సాగులో యాంత్రీకరణ పెరిగింది. ప్రస్తుతం వరి సాగు జోరందుకున్నది. నాగార్జునసాగర్ ఆయకట్టులో నాట్లు వేస్తున్నారు. దమ్ము చేసే సమయంలో ట్రాక్టర్‌కు కేజ్ వీల్స్‌ను వినియోగిస్తుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ వీల్స్‌తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఎంతో మంది ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్ వీల్స్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్‌ను నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రమాదాలకు కారణాలివీ..
పొలాలు అన్నీ ఒకేలా ఉండవు, నీరు పెట్టిన తర్వాత డ్రైవర్‌కు భూమి ఎలాంటిదో తెలియకపోవడం. నీరు ఎక్కువగా ఉన్న స్థలంలో కేజ్ వీల్స్ ఎక్కువ లోతుకు వెళ్లి భూమి వదులుగా మారుతుంది. దాంతో ట్రాక్టర్ దిగబడకుండా ఉండేందుకు, గట్టి ప్రదేశంలో వెళ్లడానికి డ్రైవర్లు ఎక్స్‌లేటర్ ఎక్కువగా ఇస్తుంటారు. దీంతో బరువంతా కేజ్ వీల్స్‌పై పడుతుంది. ముందు టైర్లు బరువుగా లేకపోవడంతో ట్రాక్టర్ తిరగబడే ప్రమాదం ఉంది. అలాగే, పొలం చివరి మూలల్లో ఎక్కువసార్లు తిరగడంతో అక్కడ లోతుగా తయారవుతుంది. వేగంగా వెళ్లే క్రమంలో దిగబడి బోల్తా పడుతుంది. డ్రైవర్లకు నైపుణ్యం లేకపోవడం, ఓవర్ స్పీడ్‌తో దున్నడంతో ప్రమాదాలు జరుగుతాయి. లోతు పెరిగిన కొద్దీ ప్రమాదాలు కూడా పెరిగే అవకాశాలుంటాయి.
జాగ్రత్తలు…
కేజ్‌వీల్స్ బిగించేటప్పుడు వెనుక టైర్లకు సమాన స్థాయిలో ట్రాక్టర్ బంపర్ ముందు వెయిట్ బిళ్లలు వేసుకోవాలి. బరువు ఎక్కువైతే మైలేజ్ తక్కువగా వస్తుందనే విధానం సరైంది కాదు.
పొలంలోకి దించే ముందు ట్రాక్టర్‌ను పూర్తిస్థాయి కండీషన్లో ఉంచుకోవాలి.
పొలం దున్నేటప్పుడు ఎప్పుడూ ఒకే వేగం ఉండాలి.
యజమానుల మెప్పుకోసం పొలాన్ని తొందరగా దున్నాలని వేగం పెంచడం ప్రమాదకరం.
పొలంలోని మలుపుల వద్ద వేగం తగ్గించాలి.
కేజ్‌వీల్స్‌తో దున్నేటప్పుడు ట్రాక్టర్‌కు కల్టివేటర్ అమర్చుకోవాలి. దీంతో బోల్తాపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.