తిరుమలగిరి, సెప్టెంబర్ 17: దళితుల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన దళిత బంధు పథకం మరో సామాజిక విప్లవం సృష్టించబోతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అలాంటి అద్భుతమైన ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే చేశారని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం దళితబంధు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సామాజిక అంతరాలను తొలగించి దళితులను ఆర్థికంగా బలోపేతం చెయ్యాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కలల సాకారమే దళిత బంధు లక్ష్యమని చెప్పారు. ఒకనాడు రక్తపుటేరులు పారిన తుంగతుర్తి నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలగిరిలో దళిత బంధు పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళిత బంధుపై చాలా మందికి అనుమానాలున్నాయని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అనేక మంది రాష్ట్ర సాధన సాధ్యం కాదని పేర్కొన్నారని, కానీ సీఎం కేసీఆర్ సాధ్యం చేసి చూపించారన్నారు. దళితబంధు పథకాన్ని కూడా పక్కా కార్యాచరణతో అమలుకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తున్నదని చెప్పారు.
ఉద్యమ సమయంలోనే బంధు పుట్టింది..
దళిత బంధు పథకం సీఎం కేసీఆర్‌కు కొత్తగా వచ్చిన ఆలోచన కాదని, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించాలని తెలంగాణ ఉద్యమంలో మేధావులను స్ఫూర్తిగా తీసుకొని అలోచించారని మంత్రి తెలిపారు. ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో ఇలాంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికీ రాలేదన్నారు. దళిత బంధు దేశానికి దిక్సూచి కానుందని, ఇతర రాష్ర్టాల్లో సైతం ఇలాంటి పథకం రావాలని ప్రజలు కోరుకుంటారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం తమదని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు.
నాడు రక్తపుటేరులు.. నేడు కాళేశ్వరం జలాలు
తుంగతుర్తి కరువు ప్రాంతానికి పెట్టింది పేరు. గతంలో భూములు పడావుపడి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వపెట్టలేని పరిస్థితి ఉండేది. సాగు, తాగు నీరు లేదు. ఆకలి బాధలు పోవాలి.. బలిదానాలు ఆగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గానికి గోదావరి జలాలు అందిస్తున్నారు. నాడు కక్షలు, కార్పణ్యాలతో రక్తం పారిన తుంగతుర్తిలో నేడు గలగల పారే నీరు కనిపిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం పచ్చని పంటలతో స్థానికంగా ఆర్థికంగా పరిపుష్టి పెరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో దేవాదుల ప్రాజెక్టు నీరు కూడా మండలంలోని పలు గ్రామాలకు రానుందని తెలిపారు.
తలరాతలు మార్చుకోవాలి
ఇక్కడి దళితుల్లో చైతన్యం ఉందని, ఈ పథకంతో తమ తలరాతలు మార్చుకోవాలని మంత్రి అన్నారు. తొందర పడొద్దని, ఆలోచించి అన్ని రకాల యూనిట్లు తీసుకొని రాణించాలని సూచించారు. అందరూ ఒకే రకమైన యూనిట్లు తీసుకోవడం వల్ల లాభాలు ఉండవని, కొంత మంది కలిసి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే లాభాలు ఉంటాయని చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షలు వారి ఖాతాల్లో జమ అవుతాయని, కలెక్టర్, ఇతర అధికారులు పర్యవేక్షించి యూనిట్లపై శిక్షణ సైతం ఇస్తారని తెలిపారు.
కేసీఆర్ చరిత్రలో నిలిచి పోతారు
దళిత బంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచి పోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. దళిత బంధు తిరుమలగిరికి కూడా వర్తించే విధంగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. గత ప్రభుత్వాలు రూ.50 వేల రుణం ఇస్తే యాభై సార్లు కార్యాలయాలు , బ్యాంకుల చుట్టూ తిప్పి ఇచ్చేవారని, పూర్తి సబ్సిడీ మీద రూ.10 లక్షలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఎంత తొందరగా సర్వే పూర్తయితే అంత తొందరగా దళితుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన ఆలోచన విధానానికి నిదర్శనమని తెలిపారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కేశవ్‌పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ రజిని, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు మంత్రి జగదీశ్‌రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ముగింపులో దళితులు, టీఆర్ఎస్ నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌ను గజమాలతో సన్మానించారు.