సూర్యాపేట (నమస్తే తెలంగాణ) : అత్యవసర వైద్య సేవల్లో ఆక్సిజన్ ప్రాధాన్యమేంటో కొవిడ్ వేళ అందరికీ అర్ధమైంది. అలాంటి ప్రాణవాయువు కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా, పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం అక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నది. స్థానికంగానే ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా ప్రెజర్ స్వింగ్ అడ్జ్యూరేషన్(పీఎస్ఏ) ప్లాంట్లను దశలవారీగా నిర్మిస్తున్నది. నల్లగొండ జనరల్ ఆస్పత్రి, మాతా శిశు కేంద్రం, సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖాన, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక్కో ప్లాంట్‌కు రూ.70లక్షల దాకా ఖర్చు చేస్తుండగా, నెలలోపే అందుబాటులోకి రానున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తొలివిడుతలో సూర్యాపేట,నల్లగొండ జిల్లాల్లో 4 ప్లాంట్లు ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటులో తొలి విడుతగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో రెండు చొప్పున మొత్తం నాలుగు ప్లాంట్లు మంజూరయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి అలాగే నల్లగొండ జనరల్ ఆసుపత్రిలో ఒక్కోటి ఏర్పాటు చేస్తుండగా మరొకటి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నాలుగు నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. ఈ ప్లాంట్లు వాతావరణంలోని ఆక్సిజన్‌ను తీసుకొని సిలిండర్లను నింపుతుంది. ఒక్కో ప్లాంటు గంటకు 32 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేస్తుంది.
నెలలోపే సిద్ధం : ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాలు నెల రోజుల్లోపే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం షెడ్లు నిర్మాణ దశలో ఉండగా ఆయా ప్రాంతాలకు పరికరాలు వచ్చేశాయి. పిల్లర్లు, గోడల నిర్మాణాలు పూర్తి కావస్తుండగా రేకులతో షెడ్డు పూర్తి చేయనున్నారు. అలాగే ఆక్సిజన్ తయారీకి కావాల్సిన ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్(పీఎస్ఏ)తోపాటు మరికొన్ని ఇతర పరికరాలు కూడా ఆయా ప్రాంతాలకు వచ్చేశాయి. నెలలోపే నిర్మాణాలు పూర్తి చేసి పరికరాలు బిగించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఇవన్నీ పూర్తయితే ఆసుపత్రుల్లో ఇక ఆక్సిజన్ టెన్షన్ ఉండదు.
మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఉండబోతున్నాయి. వాస్తవానికి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తొలి విడతలో ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు కాలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి అదానీ గ్రూప్ అధికారులతో మాట్లాడడంతో సూర్యాపేటలో మొదటి విడతలోనే ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నది. రెండో విడతలో మరోటి రానుంది. కరోనా సమయంలోనూ జనరల్ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మాణం చేయించారు. దీంతో జిల్లా కేంద్రంలో మూడు ప్లాంట్లు ఉండబోతున్నాయి.
హుజూర్‌నగర్‌టౌన్ : హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో 500లీటర్ల కెపాసిటీతో కొత్త ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సూపరింటెండెంట్ కరణ్‌కుమార్ తగిన వసతులు కల్పించారు. వారం రోజుల్లో ప్లాంట్‌కు అవసరమైన ఇతర వస్తువులను సమకూర్చి ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో పీఎస్ఏ ప్లాంట్ నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. ఇప్పటికే షెడ్డు నిర్మాణం పూర్తి కావస్తుండగా కావాల్సిన పరికరాలు వచ్చేశాయి. నెల రోజుల్లోపే పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉండగా ఇక ఇది కూడా ప్రారంభమైతే ఆక్సిజన్ టెన్షన్ ఉండదు.
కరోనా సమయంలో రోగులు పడిన ఇబ్బందులు అధిగమించడానికి ఆసుపత్రిలోనే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం సంతోషం. ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సహజ సిద్ధమైన ప్రాణవాయువును రోగులకు అందించే అవకాశం ఉంది. నెలరోజుల్లో ప్లాంట్ అందుబాటులోకి వస్తుంది.