తిరుమలగిరి మండలాన్ని దళిత బంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా అమలు కోసం కసరత్తు మొదలైంది. మండలంలో ఎంతమంది లబ్ధిదారులున్నారు.?స్థానికంగా ఉపాధి, వ్యాపార, ఇతర అవకాశాలు ఎలా ఉన్నాయి.? ఎవరికి ఏ యూనిట్లు ఇస్తే బాగుంటుంది? అనే విషయంపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి హాజరుకానున్నారు.
సమావేశం అనంతరం పథకం అమలుపై
విధివిధానాలు వెల్లడించే అవకాశం ఉండడంతో స్థానికంగా ఆసక్తి నెలకొన్నది.
సూర్యాపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరి మండలానికి ప్రకటించిన దళితబంధు పథకంపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోగా అందులో తిరుమలగిరి మండలం ఉన్న విషయం విదితమే. మండలంలో సుమారు 2500 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం హైదరాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహిస్తుంచనుండగా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి… ఆయా ప్రాంతాల్లో ఉన్న ఉపాధి, వ్యాపార తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉంది. జిల్లా నుంచి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగేంధర్‌రావు హాజరుకానున్నారు. సమావేశానంతరం మండలంలో దళిత కుటుంబాల ఇంటింటి సర్వే నిర్వహించి పూర్తిస్థాయి అంచనాలు రూపొందించనున్నారు.
దళితోద్ధరణకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షలు ఇచ్చేలా దళితబంధు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత సీఎం తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో అమలు చేయగా తదనంతరం హుజూరాబాద్‌కు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని మరో నాలుగు మండలాలకు ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం ఉంది. దీంతో ఈ మండలంలో దళితబందు పథకాన్ని ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. అయితే పైలెట్ ప్రాజెక్టు అమలు తీరుపై రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈ నెల 13న ప్రగతిభవన్‌లో ఆయా జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. దళితబంధు ప్రకటించిన మండలాల్లో దళితుల ఆర్థిక స్థితిగతులు, దళిత బంధుకు అర్హులైన కుటుంబాలు, వారికి స్వయం ఉపాధి కల్పించడానికి గల మార్గాలు మార్కెటింగ్ పరిస్థితులు, ఏయే రంగాల్లో ఉపాధికి అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
2,500 కుటుంబాలకు పైనే లబ్ధి
తిరుమలగిరి మండలంలో దాదాపు 2,500 పైనే దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తిరుమలగిరి మండలంలో 16 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ కలిపి మొత్తం 12,440 నివాస గృహాలు ఉండగా వీటిలో 2,398 దళిత నివాసాలు ఉన్నాయి. అలాగే మండలంలో 15 ఎస్సీ వార్డులు, 23 దళిత వాడలు ఉన్నాయి. 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 2,398 నివాసాలు ఉండగా తదనంతరం వివాహాలు కావడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారితో కలిపి దాదాపు 2,500 పైనే దళిత కుటుంబాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలకు వస్తున్నారు. జిల్లా స్థాయిలో మరో సమావేశం నిర్వహించి మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించి మొత్తం దళిత కుటుంబాలను గుర్తించి లబ్ధిదారుల సంఖ్యను ఫైనల్ చేయనున్నారు.