నేటి నుంచి శ్రావణమాసం
పూజలకు ప్రత్యేకం
శుభకార్యాలకూ అనుకూలమే..
రామగిరి/సూర్యాపేట టౌన్, ఆగస్టు 8 : హిందూ సంప్రదాయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే మాసం.. శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభమవుతున్నది. ఈ పర్యాయం సోమవారంతో మాసం షురూ అవుతుండడం విశేషం. శ్రావణం మాసం అంటేనే మహిళలకు లక్ష్మీ మాసం. శివకేశవులతోపాటు లక్ష్మి, పార్వతులకు నిత్యపూజలు నిర్వహించే ఈ మాసాన్ని ‘లక్ష్మీమాసం’ అని కూడా వ్యవహరిస్తారు. శుభాలు, వరాలను కురిపించే ఈ మాసంలో ప్రతి నిత్యం ఇష్టదైవాలను కొలుస్తారు. ఈ నెల రోజుల్లోనే అనేక పండుగలు వస్తాయి. దీంతో ఈ నెలంతా ఆధ్యాత్మిక వసంతం సంతరించుకుంటది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకే పూజల నిర్వహణ, భక్తులకు అనుమతి ఉంటుంది.
శ్రావణ మాసానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. శివకేశవుల ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించే భక్తులు శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతారు. నెల రోజులపాటు ఒకే పూజతో దీక్ష పూనడం ఈ మాసం ప్రత్యేకత. లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుకు ప్రీతికాలమైన పగటి నిద్రను స్త్రీలు ఆచరించరాదని అంటారు. కోరికలు తీర్చే వరలక్ష్మీవ్రతాలు, శ్రీకృష్ణుడు, హయగ్రీవుడు, బదరీనారాయణుడు, సంతోషిమాత జయంత్యుత్సవాలు, నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి వేడుకలు వస్తాయి. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం, శుక్రవారం లక్ష్మీ ఆరాధన ఎంతో శ్రేష్టమైనవి. జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా పిలిచే వేడుకలను ఈ మాసంలోనే నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జయంతి వేడుకలను బ్రాహ్మణులు వైష్ణవ సంప్రదాయంగా ఈ మాసంలోనే నిర్వహిస్తారు. దీక్షలు, పూజలతో కొనసాగే ఈ సమాసంలో కృష్ణాష్టమి పర్వాలు ఎంతో ఆనందోత్సాహం కల్గిస్తాయి.
ఈ మాసంలో వచ్చే వేడుకలు
శ్రావణ మాసంలో భాగంగా ఈనెల 11న శ్రీ ఆండాల్ అమ్మవారి తిరునక్షత్రం, 12న నాగుల(గరుడ)పంచమి, 18న సర్వేషాం ఏకాదశి, 20న వరలక్ష్మీ వత్రం(మంగళగౌరీ వ్రతం), 22న రాఖీ పౌర్ణమి, శ్రావణపూర్ణిమ(హయగ్రీవ జయంతి), 24న శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవం, 29న కృష్ణాష్టమి వస్తున్నాయి. వీటితోపాటు తొలి సోమ, మంగళ, శుక్ర, శని వారాల పూజలు నిర్వహిస్తారు.
శ్రావణ వరలక్ష్మీ పూజలు..
శ్రావణ శుక్ర పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించే వ్రతమే వరలక్ష్మీ పూజ(వ్రతం). ఈ మాసంలో మహిళలు పూజించే అతి ముఖ్య పూజ వరలక్ష్మీ పూజ. అష్టలక్ష్మీ దేవతలు వరాలను ప్రసాదించాలని ప్రతి శుక్రవారం పూజలు చేయడం ఆచారం. ఆదిలక్ష్మి, ధ్యానలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి దేవతలకు ప్రీతికరమైన రీతిలో పూజలు చేస్తూ ఇష్టమైన వంటకాలతో కూడిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ మాసం నియమాలు..
సోమవారం : శ్రావణంలో వచ్చే ప్రతి సోమవారానికి విశిష్టత ఉంటుంది. ముక్కంటికి సోమవారం ప్రీతికరమైంది. ఈ రోజు స్వామివారిని పూజిస్తే కటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
మంగళవారం : అభయమిచ్చే హనుమంతుడు సకల విఘ్నాలు తొలిగించి.. సకల దేవతల కంటే ముందే మొదటి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళవారమే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం.
బుధ, గురువారాలు : బుధ, గురువారానికి విశిష్టత ఉంది. బుధవారం అయ్యప్పకు ప్రీతి కరమైంది. గురువారం రాఘవేంద్ర స్వామి, దక్షిణమూర్తి, షిరిడీ సాయిబాబాకు మంచిరోజులుగా పరిగణిస్తారు.
శుక్రవారం : శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ప్రాధాన్యమైనది. అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి శుభప్రదమైంది.
శనివారం : కలియుగదైవం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఉపవాసాలుంటారు. స్వామికి పుష్పార్చనలు చేస్తారు. తులసీ దళాలు మాలలుగా సమర్పిస్తారు.
ఆదివారం : ప్రత్యేక్ష భగవానుడు ఆదిత్యుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకు భక్తితో నమస్కరిస్తే కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.
అత్యంత శుభప్రదం శ్రావణం
శ్రావణ మాసం వస్తుందంటేనే అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి పెరుగుతది. అన్ని మాసాల్లో ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నెలరోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా దేవతలకు బోనాలు, మొక్కులు సమర్పిస్తుంటారు. అమ్మవారి దర్శనం ఎంతో శుభప్రదం. ఈ మాసంలో దర్వేశిపురానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలి.
-నాగోజు మల్లాచారి, ప్రధానార్చకుడు,
రేణుకా ఎల్లమ్మ దేవస్థ్ధానం, దర్శేశిపురం
మహా విష్ణువుకు ప్రీతికరమైన మాసం
అత్యంత పుణ్యప్రదమైనది, పవిత్రమైనది ఈ మాసం. శ్రావణ మాసం మహావిష్ణువు, ఆయన సతీమణి మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే ఈ నెలలో వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసంలో నిర్వహించే కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది.
-నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, ప్రధానార్చకుడు, వేంకటేశ్వరాలయం,
సూర్యాపేట