కట్టంగూర్, ఆగస్టు 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సమస్యలు పరిష్కారమై పచ్చని, పరిశుభ్ర పల్లెలుగా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతులు సమకూర్చుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామపంచాయతీ ప్రగతిపథంలో పయనిస్తున్నది.
కట్టంగూర్ మండలంలోని పిట్టంపల్లి, పామనుగుండ్ల పంచాయతీలకు అనుబంధంగా ఉన్న ఇస్మాయిల్పల్లి గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. 1200 జనాభా ఉన్న ఈ కొత్త గ్రామపంచాయతీలో పల్లెప్రగతి కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలు సమకూరి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్‌తో వారానికి రెండ్రోజులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తూ ఎరువును తయారు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. లూజ్ లైన్లను సరిచేశారు. హరితహారంలో భాగంగా రోడ్ల వెంట, వీధుల్లో సుమారు 2వేల మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ 6 రకాల పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు 90శాతం పూర్తయ్యాయి. పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రూ.2.40లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.3లక్షలతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి 1500 మొక్కలు నాటారు. పంచాయతీ నిధులతో డ్రైనేజీలను నిర్మించారు.
సీఎం కేసీఆర్ మా గ్రామాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసి సమస్యలు తీర్చిండు. గ్రామస్తులు, అధికారుల సహకారంతో పల్లె ప్రగతితో చాలా అభివృద్ధి జరిగింది. గ్రామంలో పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు చేపట్టాం. 90శాతం మంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాం. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం.
పెద్దవూర, ఆగస్టు 8 : కూలీల కొరతను తీర్చేందుకు వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్నది. వందల మంది కూలీలు చేసే పనిని అత్యాధునిక యంత్రాలు గంటల వ్యవధిలో పూర్తి చేస్తున్నాయి. దీంతో కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతున్నది. ఈ నేపథ్యంలో ఆముదాల నుంచి గింజలను వేరు చేసే యంత్రం పెద్దవూర మండలం బట్టుగూడెం చేరుకున్నది. ఈ యంత్రం గంటకు 12-13 బస్తాల గింజలను వేరు చేస్తున్నది. ఇందుకు గాను గంటకు రూ.1500 చార్జీ తీసుకుంటున్నారు. 12బస్తాల ఆముదాలను కూలీల ద్వారా వేరు చేయలంటే రూ.3వేలు, పొట్టును వేరు చేయడానికి ట్రాక్టర్ ఫ్యాన్‌కు గంటకు రూ.వెయ్యి కలిపి మొత్తం రూ.4వేలు ఖర్చు వస్తుంది. యంత్రంతో రైతుకు రూ.2500 వరకు ఆదా అవుతున్నది. యంత్రం
రావడంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.