ఆహ్లాదకరమైన వాటర్ ఫౌంటేన్.. పచ్చని మొక్కలు, ఆకర్షణీయమైన గ్రీనరీతో
సూర్యాపేటలో పైలాన్ ఏర్పాటు చేయనున్నారు. సద్దుల చెరువు మధ్యలో 30 మీటర్ల ఎత్తులో ‘ఐ లవ్ సూర్యాపేట’ పేరుతో నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మోడల్ డిజైన్‌ను రూపొందించగా రూ.50 లక్షలతో టెండర్లు పిలిచేందుకు మున్సిపల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సద్దుల చెరువు మినీట్యాంక్ బండ్ సుందరంగా మారగా ఈ పైలాన్ భానుపురికే ఐకాన్‌గా నిలువనున్నది. సద్దుల చెరువు మధ్యలో పైలాన్ ఏర్పాటు30 మీటర్ల ఎత్తుతో ఆహ్లాదకరంగా.. రూ.50లక్షలతో నిర్మించేందుకు సన్నాహాలు
సూర్యాపేట, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో సూర్యాపేట అగ్రగామిగా నిలుస్తున్నది. జిల్లా కేంద్రం కావడం, కలెక్టరేట్, పోలీసు భవనాలతో పాటు అన్ని శాఖల కార్యాలయాలు వచ్చాయి. వీటికి తోడు మినీ ట్యాంక్ బండ్లు, మోడల్ మార్కెట్, కర్నల్ సంతోష్‌బాబు విగ్రహం ఏర్పాటు, మెడికల్ కళాశాల వంటివి అనేకం సూర్యాపేటకు ఐకాన్‌గా నిలుస్తున్నాయి. గతంలో పట్టణ ప్రజలు ఉల్లాసంగా గడిపేందుకు కనీసం పార్క్ కూడా లేని పరిస్థితి. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఏడున్నరేండ్లలో 50కి పైనే పార్కులు, మినీ ట్యాంక్ బండ్లు, రహదారుల మధ్య పచ్చిక బయళ్లు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ప్రస్తుతం చేపడుతున్న ‘ఐ లవ్ సూర్యాపేట’ పైలాన్ మరో ఐకాన్‌గా నిలవబోతోంది.
బురద గుంతలు, సర్కారు తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలతో నిండి ఉండే సద్దుల చెరువును మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.20కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్‌గా మార్చారు. కట్టపై విశాలమైన రహదారి, పచ్చని మొక్కలు, రేయిలింగ్, వాకింగ్ ట్రాక్, ఫ్లడ్ లైట్లతో కొత్త శోభను సంతరించుకున్నది. దీనికి తోడు తాజాగా రూ.50 లక్షల మున్సిపల్ నిధులతో చెరువులో 20 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా నిర్మించిన కాంక్రీట్ స్టేజ్‌పై స్టీల్‌తో 30 మీటర్ల ఎత్తుతో పైలాన్ నిర్మాణం చేయనున్నారు.
పైలాన్ చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తారు. ఆరేళ్లుగా చెరువు ఏనాడూ ఖాళీ కాలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మూసీ నీటితో నింపుతున్నారు. మినీ ట్యాంక్ బండ్‌గా మారిన చెరువు నిండా నీళ్లతో నిండి ఉండగా.. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పైలాన్‌తో ఇక నుంచి ప్రజలకు కనువిందు చేయనుంది.