హుజూర్నగర్, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ‘ధరణి’ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తాసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను రైతులు, కొనుగోలుదారులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కోసం మీసేవకు వెళ్తుండగా నిర్వాహకులు విక్రయ, కొనుగోలుదారుల వద్ద రూ.600 నుంచి రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వీస్ చార్జీల పేరుతో వసూళ్లు దీనికి అదనమని చెబుతున్నారు. అంతేకాకుండా వివిధ ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉండడంతో ఇదే అదునుగా భావించి నిర్వాహకులు ఎంత చెబితే అంత ఇచ్చుకోవాల్సి వస్తున్నదని ఆరోపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 2 ఈసేవ, 83 మీసేవ, 4 టీఎస్ ఆన్లైన్ కేంద్రాలున్నాయి. ప్రభుత్వం అన్ని రకాల సేవలను ఒకేచోట అందించడంతోపాటు అవినీతిని అరికట్టాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీసేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనల మేరకు సిటిజన్ చార్ట్ ప్రకారం సర్వీస్ చార్జీలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలా చోట్ల అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వారం క్రితం హుజూర్‌నగర్‌లోని ఓ మీ సేవ సెంటర్‌కు వెళ్లాను. సర్వే నంబర్ 467/13లో 1.05 ఎకరాల రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 3న వచ్చేలా స్టాట్ బుక్ చేయించా. దాని కోసం రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అదనంగా రూ.1000 వసూలు చేశారు.
-జక్కుల వెంకటేశ్వర్లు, రైతు, హుజూర్నగర్
హుజూర్‌నగర్‌లోని 671/4/2 సర్వే నంబర్లో నా పేరు మీద 0.3450 గుంటల భూమి ఉంది. అందులో నాలుగున్నర గుంటల భూమిని నా భార్య నాగమణి పేరు మీద మార్చడం కోసం మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేయించా. స్లాట్ బుకింగ్ కోసం రూ. 1000 అడిగారు. ఇదేమంటే హుజూర్‌నగర్‌లోని అన్ని మీసేవల్లోనూ ఇలానే ఉంటుందని చెప్పారు.
మీసేవ నిర్వాహకులు అదనపు వసూళ్లకు పాల్పడిన వారి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులు తమ సెంటర్లలో కచ్చితంగా సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలి.
-జయశ్రీ, తాసీల్దార్, హుజూర్నగర్