చెక్‌డ్యామ్‌లతో జలకళ
ఆత్మకూర్.ఎస్ మండలంలో తీరిన కరువు
తొలిసారిగా 13వేల ఎకరాలు సాగులోకి..
ఉబికి వస్తున్న భూగర్భ జలాలు..
పొంగిపొర్లుతున్న బోర్లు
పాలేరు వాగు పరిధిలో పెరిగిన సాగు
ఆనందంలో రైతాంగం
సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాకు కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీళ్లు పుష్కలంగా వస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. బీడు భూమి అన్నదే లేకుండా మొత్తం సస్యశ్యామలంగా మారింది. మూడు నదుల నీళ్లు రాని ప్రాంతాలకు లిఫ్ట్‌లు, చెక్ డ్యామ్‌లు నిర్మించి మిగిలిన కొద్ది వ్యవసాయ భూములను కూడా సాగులోకి తీసుకువస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్ మండలం గతంలో కరువు ప్రాంతంగా పేరొందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు చుక్కనీరు కూడా దొరికేది కాదు. రైతులు తమ బావులు, బోర్లలో పాతాళంలో ఉన్న జలాన్ని తోడి కొద్దోగొప్పో సాగు చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి కరువు మండలాలను ప్రకటించగానే అందులో దాదాపు టాప్‌లో ఆత్మకూర్.ఎస్ ఉండేది. పాతాళంలోకి నీరు చేరడంతో మండలంలో బావులు తవ్వద్దు… బోర్లు వేయవద్దని చంద్రబాబు నాయుడు హయాంలో ఏకంగా సర్క్యులర్ కూడా జారీ చేశారు. అలాంటి మండలం నేడు వరి మాగాణమైంది. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు రావడంతో దాదాపు 80శాతం భూములు సాగులోకి వచ్చాయి.
కాళేశ్వరం నీళ్లు వచ్చినా…
ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పూర్తయ్యి జిల్లాకు గోదావరి జలాలు వచ్చినప్పటికీ ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాలేరు వాగు పరిసరాలకు నీరందలేదు. వాగు పరిసరాల్లో ఎక్కడా చెరువులు లేకపోవడం, చిన్నపాటి కుంటలకు కాళేశ్వరం జలాలు వెళ్లేలా లింకులు లేకపోవడంతో గోదావరి జలాలు వచ్చినా ఫలితం లేకపోయింది. ఐదేండ్ల కిందట మిడ్తనపల్లి, బొప్పారం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మించగా దాని ఫలితం నేడు కనిపిస్తున్నది. గోదావరి నీళ్లు తొలిసారి ప్రవహిస్తున్న సమయంలో పాలేరు పరిసర ప్రాంతాల రైతులు తమ గోసను విన్నవించుకున్నారు. దాంతో వాగుపై విరివిగా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సంకల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో జిల్లాకు రూ.120కోట్ల వ్యయంతో 19 చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయి. వీటిలో 9చెక్ డ్యామ్‌లు ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని పాలేరు వాగుపైనే ఉండడం గమనార్హం.
చెరువులను తలపిస్తున్న చెక్‌డ్యామ్‌లు..
పాలేరు వాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తి కావడంతో వాగు వెంట భూముల్లో జలకళ ఉట్టిపడుతున్నది. మోటార్లు వేయకున్నా నీళ్లు ఉబికి వస్తున్నాయి. మండల పరిధిలోని ఏపూరు, బొప్పారం టు లింగంపల్లిబాట, మిడతనపల్లి, గంగమ్మతల్లి దేవాలయం(మిడ్తనపల్లి), మక్తకొత్తగూడెం, గౌస్తండాబాట, మక్తకొత్తగూడెం(గంగమ్మ ఏనెకింద), చాకలిబండ(ఏపూరు), గుండ్ల సింగారంబాట వద్ద నిర్మాణాలు పూర్తి కావడంతో భూగర్భ జలాలు ఉప్పొంగుతున్నాయి. శ్రీరాంసాగర్ కాలువను వాగుకు అనుసంధానం చేయడంతో చెక్ డ్యామ్‌లు కళకళలాడుతున్నాయి. ఒక్కో చెక్‌డ్యాం చుట్టూ దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.
చెక్ డ్యాం నిర్మాణంతో దశ మారింది..
నాకు బొప్పారం గ్రామంలో ఆరెకరాల భూమి ఉంది. కాళేశ్వరం జలాలు వచ్చినా గతేడాది వరకు అరెకరం పొలం కూడా పండించలేదు. ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేశాం. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడ్తనపల్లి గ్రామం వద్ద వాగులో చెక్ డ్యాం నిర్మించడంతో భూగర్భ జలాలు పెరిగి నేడు ఆరెకరాలు సాగు చేస్తున్నా.
చాలా ఏండ్ల తర్వాత నీళ్లు చూస్తున్నాం
మా ఊరు వెంటనే పాలేరు వాగు ఉంది. కానీ, ఏనాడూ నీళ్లను చూసింది లేదు. 1983 సంవత్సరంలో భారీగా నీళ్లు వచ్చి పంటలు బాగా పండాయట. కానీ, ఆ తర్వాత మళ్లీ ఇన్నేండ్లకు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో చెక్‌డ్యాం నిర్మించి నీళ్లు అందిస్తున్నరు. మా బోరు మోటర్ ఆన్ చేయకున్నా పైపుల నుంచి నీళ్లు వస్తున్నాయి.