కోదాడ రూరల్, అక్టోబర్ 4 : కోదాడ పట్టణంలోని ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళా దొంగను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ నర్సింహారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీచర్ కాలనీకి చెందిన ఉడుత చక్రపాణి 20 యేండ్లుగా రెడీమేడ్ వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత నెల 29న ఇంట్లో లాకర్‌ను తెరచి చూడగా బంగారు నగలు, నగదు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దుకాణంలోరెండు నెలలుగా పని చేస్తున్న రామిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఎస్కే గౌసియాపై అనుమానంతో విచారించగా ఆమె చోరీకి పాల్పడినట్లు ఒప్పుకుంది. గతంలో గౌసియా హైదరాబాద్‌లో చిన్న, చిన్న దొంగతనాలు చేసి ఉండడంతో పెద్ద మొత్తంలో ఒకేసారి దొంగతనం చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దుకాణంలో నమ్మకంగా పనిచేస్తూ గత నెల 29న దుకా ణం రద్దీగా ఉన్న సమయంలో ఇంటి తాళాలు తీసుకుని నగదు, నగలు దొంగతనం చేసి తన సంచిలో వేసుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా దుకాణంలో నుంచి వెళ్లి నగలను ఇంట్లో చెట్ల మధ్య గుంత తీసి అందులో దాచి పెట్టింది. మరుసటి రోజు దుకాణం యజమాని ఫోన్ చేయగా తన మామకు బాగ లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలిపింది. అనంతరం ఫోన్ స్వీచ్‌ఆఫ్ చేసింది. దీంతో పోలీసులు గౌసియా దొంగతనం చేసినట్లు నిర్ధారించి సోమవారం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించి ఇంట్లో నగదు, పాతిపెట్టిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు త్వరగా చేధించిన పట్టణ సీఐ నర్సింహారావు, ఎస్ఐ రాంబాబును, ఏఎస్ఐ సైదా, సిబ్బంది గౌతమి, యల్లారెడ్డి, ఉపేందర్‌ను ఆర్.భాస్కరన్ అభినందించారు.