సూర్యాపేట, అక్టోబర్ 3(నమస్తేతెలంగాణ) : యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నడిపిస్తూ అడిగినా, అడుగకున్నా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజానాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న చీరెలను ఆదివారం ఉదయం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఏ ఆడబిడ్డ అడుగలేదు.. ఏ ఒక్కరూ అనుకోలేదు.. అడిగితే ఇస్తారని కూడా ఎవ్వరూ ఊహించలేదు… కానీ, పండుగ సమయాల్లో బట్టలు పెట్టొచ్చు అనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే స్ఫురించి అమలు చేస్తున్నరు’ అని కొనియాడారు. పెళ్లిళ్లు, పండుగల సమయాల్లో ఆడబిడ్డలకు బట్టలు పెట్టడం మన సంప్రదాయం.. బట్టలు పెట్టలేదని గొడవలు పడి అలిగి వెళ్లిపోయే వాళ్లను చూశాం కానీ, రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ తన తోబుట్టువులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి బతుకమ్మ పండుగకు కానుకగా ప్రవేశపెట్టిందే చీరెల పంపిణీ అని మంత్రి వివరించారు. జిల్లా నుంచి ఎందరెందరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు మంత్రులు కూడా అయ్యారు. ఒడ్డూ, పొడుగును చూసుకుంటూ 20ఏండ్లు పాలించినం అని గొప్పలు చెప్పుకొన్నారు.. కానీ వారెవరికీ రాని ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే వచ్చిందంటే.. తెలంగాణ సమాజాన్ని బిడ్డలుగా, తో బుట్టువులుగా భావించడమే కారణమని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సైతం ఉపాధి కల్పించి ఆత్మహత్యలను నివారించేలా ఆదుకునేందుకు చీరెల పంపిణీ కార్యక్రమం దోహదపడుతున్నదన్నారు. అటువంటి మహానేతను దూషించేందుకు విపక్షాలకు నోళ్లెలా వస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, సూర్యాపేట, చివ్వెంల ఎంపీపీలు, జడ్పీటీసీ బీరవోలు రవీందర్‌రెడ్డి, ధరావత్ కుమారీబాబూనాయక్, జీడి భిక్షం, భూక్యా సంజీవనాయక్, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర సభ్యుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు, మారినేని సుధీర్‌రావు, జూలకంటి జీవన్‌రెడ్డి, జూలకంటి సుధాకర్‌రెడ్డి, సుశీలాసాగర్, రౌతు నర్సింహారావు, హనుమంతరావు, సత్యం, నాగరాజు, లచ్చీరాంనాయక్ పాల్గొన్నారు.