సమాజ వృద్ధిలో పునాదుల్లాంటి వయో వృద్ధులకు బాసటగా నిలిచే టోల్ ఫ్రీ నంబరే 14567. మలి వయస్సులో పిల్లల ఆదరణకు నోచక అవస్థలు పడే వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల కింద ప్రత్యేక చట్టం చేసి, ఈ నంబరును అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటుచేసి అనేక మంది సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. నేడు ఈ నంబర్ దేశానికే దిక్సూచి కానున్నది. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14567 టోల్‌ఫ్రీ నంబరును శుక్రవారం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో యావత్ జాతికి ఆదర్శంగా నిలుస్తున్న కార్యక్రమాల్లో మరొకటి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వయోవృద్ధులకు బాసటగా మన టోల్ ఫ్రీ నంబర్
రాష్ట్రం సాధించాక ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేటి నుంచి మరో కార్యక్రమంతో దేశానికే ఆదర్శంగా నిలువనున్నారు. రాష్ట్రంలో వయో వృద్ధుల సంక్షేమానికి మూడేండ్ల కిందట ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 14567 నేటి నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నది. వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1257 కేసులు నమోదు చేశారు. అందులో 693 పరిష్కారం కాగా మరో 564 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
వృద్ధులకు అండగా చట్టాలు
వృద్ధుల శ్రేయస్సు కోసం 2007 సంవత్సరంలో తల్లిదండ్రులు-పెద్దల పోషణ, సంక్షేమ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని వారికి మూడు నెలల జైలు, రూ.5వేల జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశాన్ని ట్రిబ్యునల్‌కు ఉంటుంది. వృద్ధులు నేరుగా ఆర్డీఓ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది పోలీసులను, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 చట్టం, నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్-1999, నేషనల్ ఓల్డ్ ఏజ్ పింఛన్ స్కీమ్-1994, అంత్యోదయ పథకం, బీమా కంపెనీల నుంచి వివిధ సీనియర్ సిటిజన్ పథకాలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రాం ఫర్ ఓల్డర్ పర్సన్స్, రైల్వే రవాణా, విమానాల్లో 40శాతం రాయితీ అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 1257 కేసులు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాల్లో ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. ఇప్పటివరకు 1257 కేసులు నమోదు చేయగా అందులో 693 కేసులు పరిష్కారమయ్యాయి.
వయో వృద్ధుల చట్టాలపై విస్త్రృత ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం వయో వృద్ధుల కోసం అమలు చేస్తున్న చట్టాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన రాయితీలు అర్హులకు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఎక్కడైనా తల్లిదండ్రులను వారసులు ఇబ్బందులు పెట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ట్రిబ్యునల్స్ ద్వారా న్యాయ సహకారం అందేలా చూస్తున్నాం.
వృద్ధులు సంపూర్ణ జీవితానికి నిలువెత్తు నిదర్శనాలు.. నేటి తరానికి మార్గదర్శకులు.. కానీ ఆధునిక సమాజంలో వాళ్ల చిరునామాలు ఆనాథాశ్రమాలు. వృద్ధాశ్రమాలు. మరీ పేదలైతే పుట్‌పాత్‌లే దిక్కు. అలాంటి వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకవచ్చింది. 14567 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదులకు అవకాశం కల్పించింది. ఆర్డీఓ స్థాయి అధికారిని సంప్రదిస్తే వారికి తమ వారసుల ఆదాయం లేదా వేతనం నుంచి రూ.10వేల వరకు ఆర్థిక సాయం అందించే వెసులుబాటు కల్పించింది. అనారోగ్యం దృష్ట్యా రూ.10వేలు సరిపోని వారు కలెక్టర్‌ను సంప్రదిస్తే రూ.20వేల వరకు పోషణ ఖర్చులు అందించే వెసులుబాటు ఉంది.