
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత నిస్తున్నది. ఇందులో భాగంగా జోనల్ వ్యవస్థ విధానంలో చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలతో చదువుకు మరింత ఊతం వచ్చింది. సర్కార్ తీసుకొచ్చిన జీవో- 317 ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు వరంగా మారింది. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ ఉపాధ్యాయులు లేక విద్యాబోధన ఆగిన పాఠశాలలకు, వివిధ కారణాల వల్ల మరికొన్ని చోట్ల కరువైన ఉపాధ్యాయుల స్థానంలో అధికారులు విభజన ప్రక్రియలో భాగంగా కేటాయింపుల్లో సమతుల్యత చేపట్టారు. దీంతో జీరో, సింగిల్ టీచర్ ఉన్న
స్కూళ్లకు భరోసానిచ్చింది. వెనుకబడిన ప్రాంతాల్లో చదువుకు ఊతం లభిస్తున్నది. భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ఊరికీ టీచర్లు వస్తున్నారంటూ సంబురపడిపోతున్నారు.
మహబూబ్‌నగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగుల విభజనకు ముందు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు విద్యావలంటీర్లు తప్పా వేరే ఆప్షన్ ఉండేది కాదు. కానీ విభజన తర్వాత అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపు జరిగింది. దీంతో ఆయా గ్రామాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు చెప్పేవారు లేక ఇన్నాళ్లు దిగులు పడిన చిన్నారుల మోములో ఇప్పుడు చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే విధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీచర్లకు పోస్టింగులు ఇచ్చారు. గతం లో ఉపాధ్యాయులే లేని ప్రాంతాల్లో ఇప్పుడు ఉపాధ్యాయులు రావడం అంటే సాధారణ విషయం కాదు. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో చదువులు చెప్పేందుకు టీచర్లు బడిబాట పట్టేందుకు సిద్ధమవుతుంటే పల్లెలు వారికి స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నాయి.
విభజన ప్రక్రియతో న్యాయం
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన దాదాపుగా పూర్తయింది. దశలవారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పోస్టుల్లో చేరిపోయారు. ఉమ్మడి జిల్లాలో జిల్లా కేడర్ స్ట్రెంత్ ప్రకారం 22,415 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరినీ ఉమ్మడి జిల్లా పరిధితోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కేటాయించారు. ఈ ప్రక్రియకు ముందు ఏర్పడ్డ ఖాళీలతోపాటు తాజా ఉద్యోగుల సర్దుబాటుతో ఏర్పడిన ఖాళీలను బదిలీలు, పోస్టింగ్‌ల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. పోస్టింగులలో మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా శాఖల అవసరాలను బట్టి కనీస సిబ్బంది అయినా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీనియార్టీ, ఉద్యోగులిచ్చిన ఐచ్ఛికాల ప్రకారంగా జీవో నెంబర్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారంగా బదిలీలు, పోస్టింగులు ఇచ్చారు. ఈ ప్రక్రియకు ముందే ప్రభుత్వం వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూలంకషంగా చర్చలు జరిపింది. సంఘాల నాయకుల సలహాలు, సూచనల మేరకు 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవోను విడుదల చేసింది.
46 మంది పిల్లలు ఒక్కడే వలంటీర్
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం మల్లోనిచెర్వు తండాలోని ప్రైమరీ స్కూల్లో నాలుగేండ్లుగా ఉపాధ్యాయులు లేరు. 46 మంది విద్యార్థులకుగానూ ఒక్క విద్యావలంటీర్ మాత్రమే బోధన చేయాల్సి వచ్చేది. విద్యావలంటీర్ ద్వారా విద్యార్థులకు పెద్దగా న్యాయం జరగడం లేదు. అవకాశం, స్తోమత ఉన్న వాళ్లు మండల కేంద్రంలోని ప్రైవేటు స్కూల్ వెళ్తున్నారు. పాపం పేద గిరిజనులు మాత్రం ఉన్నంతలో తండాలోనే చదువుకోవాల్సి వచ్చేది. కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల విభజన ప్రక్రిలో భాగంగా ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడిని కేటాయించారు. దీంతో ఇక తండాలో విద్యావికాసానికి అవకాశం ఏర్పడింది.
జీరో నుంచి ఇద్దరి వరకు
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో డిప్యుటేషన్ మీద ఓ టీచర్ పనిచేసేవారు. రెగ్యులర్‌గా ఒక్కరంటే ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు కొత్త జోనల్ విధానంతో ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చారు. దీంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది. అలాగే ఉర్దూ హైస్కూల్లో గతంలో ముగ్గురు మాత్రమే ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం అదనంగా ఇద్దరు రావడంతో ఉపాధ్యాయుల సంఖ్య ఐదుకు చేరింది.
నాడు ఒక్కరు నేడు ఇద్దరు
నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం సార్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉండేవారు. సింగిల్ టీచర్ మాత్రమే వీరికి విద్యాబోధన చేస్తుండేది. ఇప్పుడు మరో ఉపాధ్యాయుడిని కేటాయించడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. సింగిల్ టీచర్ కావడంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవాళ్లు. ఇప్పుడు ఉపాధ్యాయుల సంఖ్య పెరగడంతో విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సైతం ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. గిరిజన విద్యార్థులకు కొత్త జోనల్ విధానం
వరంగా మారింది.
హెచ్ఎం పోస్టు వచ్చింది
ఊట్కూరు మండలంలోని పులిమామిడి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థులు ఉన్నారు. విభజనకు ముందు ఇక్కడ ఐదుగురు టీచర్లు మాత్రమే ఉండగా.. విభజన అనంతరం ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ అదనంగా విధుల్లో చేరారు. దీంతో ఉపాధ్యాయుల సంఖ్య ఆరుకు చేరింది. హెచ్ఎం రాకతో పాఠశాల నిర్వహణతోపాటు విద్యాబోధనకు అదనంగా ఒకరు వచ్చినట్లయింది. పట్టణాలకు దూరంగా ఉండే ప్రాంతం కావడంతో ఈ పాఠశాలకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ కొత్త జోనల్ విధానం పుణ్యాన ఓ ఉపాధ్యాయుడు రావడం విద్యార్థులకు మంచి పరిణామం