నిజామాబాద్ లీగల్, జనవరి 3: న్యాయ సేవలు అందించడంలో జిల్లాతో అన్ని తీపిగుర్తులే ఉన్నాయని, న్యాయవాదులతో ఆరేండ్ల ఆత్మీయ బంధం ఉన్నదని నిజామాబాద్ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్. గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సోమవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. బోధన్ అదనపు జిల్లా జడ్జిగా, అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో అదనపు జిల్లా జడ్జిగా రెండు పర్యాయాలు న్యాయమూర్తిగా విధులు నిర్వహించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ సేవలందించడంలో న్యాయవాదుల సహకారం మరువలేనిదని అన్నారు. తనకు, తన కుటుంబానికి కరోనా సోకిన సమయంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది వెన్నంటి నిలిచి కరోనాను జయించడంలో తోడ్పాటు అందించారని గుర్తు చేసుకున్నారు. ఎక్కడ ఉన్నా నిజామాబాద్ బార్ అసోసియేషన్ చిరస్మరణీయంగా తన మదిలో నిలిచి ఉంటుందన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ.. ఒక సీనియర్ న్యాయమూర్తి సేవలు దూరమైనా.. న్యాయ సేవా సంస్థ సభ్య కార్యదర్శిగా అందరికి దగ్గరగానే ఉంటారని అన్నారు. కోర్టు ప్రాంగణంలో ప్రథమ చికిత్స కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, న్యాయవాదుల సహకారం అవసరమని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఎర్రం విఘ్నేశ్.. జడ్జి గోవర్ధన్‌రెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్‌ను కట్ చేశారు. అదనపు జిల్లా జడ్జిలు గౌతం ప్రసాద్, షౌకత్ జహాన్ సిద్ధిఖీ, పంచాక్షరి, సీనియర్ సివిల్ జడ్జిలు విక్రమ్, కిరణ్మహి, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, గిరిజ, భవ్య, అజయ్‌కుమార్ జాదవ్, సీనియర్ న్యాయవాదులు టక్కర్ హన్మంత్‌రెడ్డి, ఎర్రం గణపతి, గొర్రెపాటి మాధవరావు, జీవీ కృపాకర్‌రెడ్డి, బార్ కార్యవర్గసభ్యులు ఉదయకృష్ణ, సాయిలు, బిట్ల రవి పాల్గొన్నారు.