
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల ప్రారంభోత్సవంలో
సిద్దిపేట జడ్పీచైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 29: క్రీడలతో శారీరక, మానసిక దృఢ త్వం లభిస్తుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో జరిగిన 40వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను వారు ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి 120 మంది బాలురు, 120 మంది బాలికలు, 40 మంది కోచ్‌లు, 30 మంది రిఫరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ క్రీడాకారులు రాణించడం శుభపరిణామమన్నారు. ఒలింపిక్స్‌లో కూడా మన దేశ క్రీడాకారులు సత్తా చాటుతున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యతనిస్తుందన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకోవడం సంతోషించదగిన విషయమన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు చొరవతో అనేక క్రీడాపోటీలకు సిద్దిపేట నిలయంగా మారిందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ఓడినా నిరాశ చెందకుండా, గెలుపు కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మందిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. సెప్టెంబర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి నాగేందర్, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మహేందర్ రావు, మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి పాల్గొన్నారు.