
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుంటే సీజ్
స్కూల్ బస్సులను కండీషన్లో ఉంచాలి
ప్రతీ బస్సును శానిటైజేషన్ చేయాలి
వాహనాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలి
ఉమ్మడి మెదక్‌లో 1929 బస్సులు
సిద్దిపేటలో 464, మెదక్‌లో 365, సంగారెడ్డిలో 1100
మరో మూడు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రవాణా శాఖ స్కూల్ బస్సులపై దృష్టి పెట్టింది. ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై వస్తే సీజ్ చేయనున్నది. ఏడాదిన్నర తర్వాత స్కూల్ బస్సులు రోడ్డెక్కనుండడంతో నిబంధనలు పాటించాలని సూచిస్తున్నది. గతేడాది మే నెల నాటికే స్కూల్ బస్సుల ఫిట్నెస్ ముగిసింది. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు అధికారులు సూచించారు. యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవర్లు, అటెండర్లు, పిల్లలను ఎక్కించుకునే సమయంలో ఎలా వ్యవహరించాలి.. తదితర అంశాలను వివరిస్తున్నారు. అలాగే, ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సిద్దిపేట, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మరో మూడు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రవాణా శాఖ స్కూల్ బస్సులపై దృష్టి పెట్టింది. ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు మూతపడడంతో ఆయా పాఠశాలలకు చెందిన బస్సులు మూలకుపడ్డాయి. వీటిని మళ్లీ తీసి, విద్యార్థులను తీసుకురావడానికి ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సమయాత్తమవుతున్నాయి. ఈ క్రమంలో బస్సుల కండీషన్ ఎలా ఉంది? తదితర వాటిపై ఉమ్మడి జిల్లాలో ఆర్టీఏ అధికారులు పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి బస్సు ఫిట్నెస్ కలిగి ఉండాలని చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 464, మెదక్‌లో 365, సంగారెడ్డిలో 1100 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,929 స్కూల్ బస్సులున్నట్టు ఆర్టీవో అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 210, మెదక్ జిల్లాలో 108, సంగారెడ్డి జిల్లాలో 438 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభ సమయానికి అన్ని బస్సులు ఫిట్నెస్ ఉండేలా చూసుకొని బస్సులు నడపాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా రవాణాశాఖ అధికారులు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టంది. ఇదే సమయంలో థర్డ్ వేవ్ వస్తుందన్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. పాఠశాలల యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవర్లు, అంటెండర్లు, పిల్లలను ఎక్కించుకునే సమయంలో ఎలా వ్యవహరించాలి.. తదితర అంశాలపై అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా నిబంధనలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే..
పాఠశాలల బస్సులు రవాణాశాఖ నింబధనలు పాటించాల్సిందే. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మోటరు వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్, పన్ను చెల్లింపు, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్, సంబంధిత బస్సు డ్రైవర్ లైసె న్స్ తప్పని సరిగా ఉండాలి. స్కూల్ బస్సులకు అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తదితర ఉండేలా యాజమాన్యాలు చూసుకోవాలి. ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిప్పితే, అధికారులు కొరడా ఝుళిపిస్తారు. బస్సులను సీజ్ చేస్తారు. పాఠశాలల ప్రారంభానికి ముందే వీటన్నింటిని సరి చూసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండాలి
-జిల్లా రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 28 : సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల బస్సులు పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలని జిల్లా రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. శనివారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో డీటీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 200 పైగా బస్సులు ఉన్నాయని, తప్పనిసరి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని సూచించారు. ఫిట్నెస్ పరీక్ష చేయించేందుకు సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం గడువు విధించిందన్నారు. ప్రతి బస్సు బీమా కలిగి ఉండడంతోపాటు టాక్స్ చెల్లించి ఉం డాలన్నారు. కండీషన్లో ఉంటేనే బస్సులను నడపాలని, కండీషన్ లేని బస్సులను నడపరాదని విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. ప్రతి బస్సులో లాగ్ బుక్ తప్పనిసరిగా ఉండాలన్నారు. వాహన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సమావేశంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం
బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలల యజమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించాం. జిల్లాలో మొత్తం 464 బస్సులు ఉన్నాయి. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తాం. ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు నడవకపోవడంతో బస్సులను పక్కన పెట్టారు. కండీషన్లో ఉన్న బస్సులనే తీయాలని చెప్పాం. ప్రతి బస్సును రోజు శానిటైజ్ చేయాలని సూచించాం. బస్సులో పిల్లలను ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు సామర్థ్యం మేరకు మాత్రమే పిల్లలను తీసుకెళ్లాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిపే స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం.
-రామేశ్వర్‌రెడ్డి,
సిద్దిపేట జిల్లా రవాణా శాఖాధికారి
ఫిట్నెస్ లేకుండా నడిపితే చర్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా తర్వాత విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు ఫిట్నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రతి బస్సును శానిటైజ్ చేసి, శుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. ఫిట్నెస్ లేకుండా ఎవరైనా బస్సులు, ఇతర వాహనాలను నడిపితే వారిపై చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1925 ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి.
-శివ లింగయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా రవాణా కమిషనర్