
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు
పల్లె ప్రగతితో అద్భుతమైన గ్రామాలు
నెలనెలా నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు
ప్రతి రోజూ ఇంటింటా చెత్త సేకరణ
తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీ
గ్రామాల్లో చేపట్టిన ప్రతి పని యాప్‌లో అప్లోడ్
గ్రామాభివృద్ధిలో సర్పంచుల తర్వాత పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర.. సమైక్య రాష్ట్రంలో పంచాయతీలపై వివక్ష కొనసాగింది. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక్క కార్యదర్శి ఉంటుండగా, ఏ పని కావాలన్నా సమయం పట్టేది. స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. క్షేత్రస్థాయిలో పాలన బాగున్నప్పుడే ఫలితాలు బాగుంటాయని భావించిన సీఎం కేసీఆర్, జీపీకో సెక్రటరీని నియమించారు. వీరంతా నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారు. గ్రామాల్లో జనన, మరణ వివరాలను ఏరోజుకు ఆరోజు నమోదు చేయడం, తద్వార వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పంచాయతీ కార్యాలయంలోనే అందజేస్తున్నారు. గ్రామాల్లో ఎన్నో పనులకు శ్రీకారం చుట్టి, ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు.
సిద్దిపేట, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక్క పంచాయతీ కార్యదర్శి ఉండేవారు. ఒక జనన సర్టిఫికెట్ కావాలన్నా.. మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ కావాలన్నా.. ఎంతో సమయం పట్టేది. నాలుగు గ్రామాలకు ఒక్కరే ఉండడంతో ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు. ఒక రోజు ఇక్కడ.. మరో రోజు ఇంకో గ్రామంలో ఉండేవారు. దీంతో ప్రజలకు మెరుగైన సేవలు అందేవి కావు. సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్క కార్యదర్శి ఉండాలని చెప్పి పెద్ద సంఖ్యలో కొత్తగా పంచాయతీ కార్యదర్శుల నియామకం చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక్క పంచాయతీ కార్యదర్శి ఉండడంతో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. 2019లో సుమారు 10వేల మంది పంచాయతీ కార్యదర్శులను టీఆర్ఎస్ ప్రభుత్వం నియామకం చేసింది. వీరంతా నిత్యం ప్రజల మధ్యన ఉండి వారి అవసరాలను తీరుస్తున్నారు. గ్రామాల్లో జనన, మరణ వివరాలను ఏరోజుకారోజు నమోదు చేయడం, తద్వారా వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పంచాయతీ కార్యాలయంలోనే అందజేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారు. పంచాయతీలకు భారీగా నిధుల ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఏడేండ్లలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. పల్లెలన్నీ, పచ్చని పల్లెలుగా మారాయి. పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.308కోట్లను విడుదల చేస్తుంది. పారిశుధ్య పనులు వెంటవెంటనే చేపట్టడంతో గ్రామాల్లో దోమల బెడద క్రమక్రమంగా తగ్గాయి. పరిశుభ్రమైన గ్రామాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పల్లెలో హరితహారంలో నాటిన మొక్కలు గ్రామాలకు పచ్చలహారం తొడిగినట్లుగా దర్శనమిస్తున్నాయి. ఊరికో పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్‌లు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, నర్సరీలు ఆయా గ్రామాలకు అవసరమైన మొక్కలు ఆయాగ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు నుంచి తీసుకుంటున్నారు. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధులను గత ప్రభుత్వాలు విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. ప్రతి నెల పంచాయతీ అకౌంట్లో నిధులు జమ అవుతున్నాయి. తొలి విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు 30 రోజుల పాటు నిర్వహించారు. ఆ తర్వాత రెండో విడుత, మూడో విడుత, నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామస్థాయిలో ప్రజలు అభివృద్ధ్దిలో భాగస్వాములవుతున్నారు. గ్రామాల్లో ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా నిర్వహిస్తున్నారు. వానకాలం కావడంతో పాటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్తులు, యువత భాగస్వామ్యంతో శ్రమదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రజల మధ్యనే పంచాయతీ కార్యదర్శులు
పంచాయతీ కార్యదర్శులు నిత్యం పల్లెల్లోనే ఉంటూ సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ గ్రామంలో చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాలు, ఇంటింటా చెత్త సేకరణ తదితర పనులను పర్యవేక్షించడంతో పాటుగా, ఏ రోజుకారోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ప్రత్యేక యాప్‌లో పొందు పరుస్తున్నారు. గ్రామాల్లో నుంచే లైవ్ ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. గ్రామంలోని నివాస గృహాలు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలతో పాటు ప్రతిరోజూ గ్రామాల్లో ఎన్ని ఇండ్ల నుంచి చెత్తను సేకరిస్తున్నారు? అనే వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి అక్కడే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు పోస్తున్నారు. మిగిలింది ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించగా వచ్చిన డబ్బులను గ్రామ పంచాయతీ అకౌంట్లో జమచేసి గ్రామాభివృద్ధ్దికి ఉపయోగిస్తున్నారు. ఎంత చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు? ఏయే వాడాలను శుభ్రం చేశారు? రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల పర్యవేక్షణ ఎలా ఉంది? కంపోస్టు షెడ్డులో చెత్తను వేరు చేస్తున్న విధానం? ఎరువు తయారీ? వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వాటిని యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు నమోదు చేస్తున్నారు. పంచాయతీ నిధులను ఎలా ఖర్చు చేశారు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో పాటు అభివృద్ధి పనుల ఫొటోలను, గృహ నిర్మాణాలు, వ్యాపార వాణిజ్య సంస్థల వాటికి అనుమతులు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, గ్రామాల్లో జరిగే రోజువారి పనులను సంబంధించిన ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో ఆయా గ్రామాల్లో ఏం జరుగుతుందని మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలు కలుగుతున్నది. గతంలో ఉన్నతాధికారులు గ్రామాలకు తనిఖీకి వెళ్తేనే ఆ గ్రామం యొక్క సమస్యలు తెలిసేది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా పర్యవేక్షణ ఉన్నతాధికారులకు సులువు అయ్యింది. దీంతో అధికారుల్లో బాధ్యత మరింత పెరిగింది అని చెప్పాలి.
మెరుగైన సేవలందించే అవకాశం దక్కింది..
గతంలో 2, 3 గ్రామాలకు ఒకే పంచాయతీ కార్యదర్శి ఉండటంతో చాలా ఇబ్బందులుండేవి. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేవు. ఒకే గ్రామానికి పూర్తి బాధ్యతలు అప్పగించడంతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తున్నాం. పల్లెప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాం. రాజకీయలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గృహ నిర్మాణ తదితర అనుమతులు ఆన్లైన్ ద్వారా సేవలందిస్తున్నాం. ఇంటి, నల్లా పన్నుల చెల్లింపులో ప్రజలు ఆసక్తి కనబరుచుతున్నారు.
కొత్త ఉత్సాహంతో పని చేస్తున్నా..
నేను 20 ఏండ్లుగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్నా. గతంతో పోల్చితే ఇప్పుడు ప్రభుత్వం అనేక మార్పులును తీసుకవచ్చింది. గతంలో గ్రామ పంచాయతీలకు నిధులు, కనీస సౌకర్యాలు లేక ఆధ్వానంగా పుట్టెడు సమస్యలతో కొట్టుమిట్టాడేవి. ఇప్పుడు అందు కు పూర్తిగా భిన్నంగా గ్రామ పంచాయతీలు మారిపోయాయి. ఒకవైపు గ్రామ సర్వతోముఖాభివృద్ధి.. మరో వైపు ప్రజల సంక్షే మం, శ్రేయస్సు కోసం ప్రభుత్వ కొత్త, కొత్త పథకాలు, ఆలోచనలు చేయడం హర్షనీయం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉంటూ కొత్త ఉత్సాహంతో పని చేస్తున్నా.