
విదేశాలకు చేపలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం
ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
వచ్చే రెండేండ్లలో ఫెడరేషన్ ద్వారా చేపల కొనుగోళ్లు
మత్స్యకారులందరికీ సొసైటీల్లో సభ్యత్వం
మత్స్యకారులకు మొబైల్ ఔట్లెట్లు అందిస్తాం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
రంగనాయకసాగర్, కోమటి చెరువుల్లో చేపపిల్లలు, రొయ్యల విడుదల
తెలంగాణలో మత్స్యపరిశ్రమకు ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి బుధవారం సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, కోమటి చెరువుల్లో చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేసి, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. ఒకప్పుడు చేపలంటే, కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే మనం చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని మంత్రి చెప్పారు. వచ్చే రెండేండ్లలో మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపల మార్కెటింగ్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మత్స్య రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. మెదక్ మండలం కోంటూరు చెరువులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టులో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు.
సిద్దిపేట/ చిన్నకోడూరు, సెప్టెంబర్ 8: తెలంగాణలో మత్స్య పరిశ్రమకు ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్, కోమటి చెరువుల్లో చేపపిల్లలు, రొయ్యలను బుధవారం విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా చేపపిల్లల వదిలే కార్యక్రమాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఒకప్పుడు చేపలంటే ఆంధ్రా ప్రాంతమే గుర్తుకు వచ్చేదని, కానీ, సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తుండడంతో తెలంగాణలో ఇప్పుడు అన్నిచోట్లా చేపలు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. దిగుమతి చేసే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయి మనం చేరామన్నారు. చేపల పెంపకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చేపపిల్లలు విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని నీటి వనరుల్లో 4.19 కోట్ల చేప, రొయ్య పిల్లలను వదలుతున్నామని చెప్పారు. కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వవైభవం తెచ్చినట్లు తెలిపారు.
కులవృత్తులకు పూర్వవైభవం..
రంగనాయకసాగర్, కోమటి చెరువు అందాలకు మంత్రి ఫిదా..
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, కోమటిచెరువు అందాలను చూసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఫిదా అయ్యారు. ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచేలా తీర్చిదిద్దారన్నారు.