
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో లోలెవల్ బ్రిడ్జిలపై వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచాయి. వరుసగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. బావులు ఎల్లబోస్తున్నాయి. కొన్ని చోట్ల బోర్పంపుల నుంచి నీరుపైకి ఉబికివస్తున్నది. వరదలతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినగా, మరికొన్ని చోట్ల కాలనీల్లో నీరు చేరింది. పాత ఇండ్లు కూలిపోతుండగా, కొన్ని చోట్ల బురుజులు పడిపోతున్నాయి. మరో రెండు రోజులు వర్షసూచన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో లోలెవల్ బ్రిడ్జిలపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల ఉధృతంగా వాగులు ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లే కుండా వర్షం పడుతూనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు జలకళ సంతరించుకుంది. జి ల్లాలోని ప్రధానమైన వాగులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు కోతకు గురికావడంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కాలనీలకు నీరు చేరింది. పాత ఇండ్లు కూలిపోతున్నాయి. కొన్ని చోట్ల బురుజులు వర్షానికి పడిపోతున్నాయి. వరుసగా వర్షాలు కు రవడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. కొన్ని చోట్ల బోర్పంపుల నుంచి నీరుపైకి ఉబికివస్తున్నది. బావులు ఎల్లబోస్తున్నాయి. వర్షాలు మరో రెండు రోజులు ఉండడంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం చేపడుతున్నది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో ప్రధానమైన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూడవెల్లి, మోయతుమ్మెద వాగులు జోరుగా ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్, తపాస్‌పల్లి రిజర్వాయర్, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కోహెడ మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బస్వాపూర్ వద్ద బ్రిడ్జిపై నుంచి నీళ్లు పోవడంతో హుస్నాబాద్- సిద్దిపేట రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఎల్లమ్మవాగు ఉధృతికి కోహెడ- కరీంనగర్ దారిలో ఇందూర్తి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. సింగరాయ చెరువులతో పాటు అన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. పలు గ్రామాల్లో పంట చేళ్లు నీట మునిగాయి. బెజ్జంకి మండలంలోని పోతారం, గూడెం వద్ద లోలెవల్ కల్వర్టులు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ పొంగిపొర్లుతున్నది. గజ్వేల్ పాండవుల చెరువు అలుగు పారుతున్నది. ఈదులవాగు ప్రవహిస్తున్నది. చేర్యాల మండలంలోని ఆకునూరు, దొమ్మాట, చిట్యాల, వేచరేణి వాగులు ప్రవహిస్తున్నాయి. తాడూరు, కడవేర్గు, చుంచనకోట గ్రామాల వద్ద లోలెవల్ బ్రిడ్జిల పైనుంచి నీరుపోవడంతో రాకపోకలు నిలిచాయి. సిద్దిపేటలోని ఎర్రచెరువు, కోమటి చెరువులు అలుగు పారుతున్నాయి. అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి వద్ద వాగు దాటుతుండగా, వరద ప్రవాహంలో కిష్టస్వామి అనే వ్యక్తి కొట్టుక పోయాడు. ధూళిమిట్ట మండల కేంద్రంలో పోచమ్మగుడివద్ద ఉన్న బోర్ బావిలో నుంచి నీరు ఉబికివస్తున్నది. తోర్నాల గ్రామంలో బురుజు కూలింది. చిన్నకోడూరు మండలం గోనేపల్లి వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్ పట్టణంలో పలు కాలనీలకు నీరు వచ్చి చేరింది. పలు దుకాణాలకు నీరు వచ్చి చేరాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్ మత్తడి దుంకుతున్నది. పలు గ్రామాల్లో పాత ఇండ్లు కూలిపోయాయి.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో వనదుర్గా ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. హల్దీవాగు, పసుపులేటి వాగులతో పాటు ప్రధానమైన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని మెజార్టీ చెరువులు అలుగులు పారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ముందు బ్రిడ్జిపై నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు వైపు మంజీరా పరుగులు పెట్టింది. దీంతో ఆలయం మూసివేసి, రాజగోపురం వద్ద పూజలను నిర్వహించారు. మెదక్ మున్సిపాలిటీలో పాత ఇండ్లను మున్సిపాలిటీ వాళ్లు కూల్చివేశారు. జలమయమైన గాంధీనగర్కాలనీని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. భారీ వర్షాలకు లోలెవల్ బ్రిడ్జిలపై వరద నీరు రావడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోగా, పాత ఇండ్లు కూలిపోయాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ సింగూరు ప్రాజెక్టు నిండింది. రిజర్వాయర్ గేట్లు ఎత్తి, చెరువులను నింపుతున్నారు. గంగకత్వవాగు, నక్కవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని చెరువులు అలుగులు పారుతున్నాయి. న్యాల్కల్ మం డలంలోని రేజింతల్ గ్రామ శివారులోని మామిడి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ము నిపల్లి మండలం చిన్నచెల్మడ-అంతారం గ్రామాల మధ్య రవాణా నిలిచింది. సింగూరు బ్యాక్ వాటర్‌తో మంజీరా నది తీర ప్రాంతా ల్లో పంట పొలాలకు నీళ్లు చేరుతున్నాయి. జహీరాబాద్ మండలంలోని కొత్తూరు శివారులో ఉన్న నారింజ ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం నిండి గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. నాగల్గిద్ద మండలంలోని కరసగుత్తి గ్రామశివారులో పంట పొలాలు నీట మునిగాయి. కోహీర్ మండలంలోని పిచేర్యాగడి గ్రామంలో ఏండ్ల నాటి బురుజు వ ర్షాలకు కూలింది. కంగ్టి మండలం తడ్క ల్ చెరువులకు గండి పడగా, వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో పంట చేళ్లలో వరద చేరింది.
మెదక్ జిల్లాలో 40.43మి.మీ. వర్షం
మెదక్, సెప్టెంబర్ 7 : మెదక్ జిల్లా వ్యాప్తంగా 40.43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా కొల్చారం మండలంలో 91.3 మి.మీ, అత్యల్పంగా మనోహరాబాద్ మండలంలో 23.0 మి.మీ వర్షపాతం నమోదైంది. తూప్రాన్‌లో 55.3 మి.మీ, వెల్దుర్తిలో 48.0, కౌడిపల్లిలో 47.3, చిలిపిచేడ్‌లో 41.3, మాసాయిపేటలో 52, మెదక్‌లో 37.5, చిన్నశంకరంపేటలో 31.7, నార్సింగిలో 34.8, చేగుంటలో 42.7, నిజాంపేటలో 39, టేక్మాల్‌లో 39, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో 36.6 మి.మీ. చొప్పున, పెద్దశంకరంపేటలో 32, రేగోడ్‌లో 36, అల్లాదుర్గంలో 32.8, నర్సాపూర్‌లో 26.8, శివ్వంపేటలో 35.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సిద్దిపేట జిల్లాలో 6.97 సెం.మీ. వర్షపాతం
సిద్దిపేట, సెప్టెంబర్ 7 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 6.97 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్‌లో మండలంలో 15.89 సెం.మీ వర్షం కురిసింది. దుబ్బాకలో 5.31 సెం.మీ, సిద్దిపేట రూరల్‌లో 7.70, చిన్నకోడూరులో 12.54, బెజ్జంకిలో 7.99, కోహెడలో 77.94, అక్కన్నపేటలో 9.48, నంగునూరులో 7.20, సిద్దిపేట అర్బన్ 9.05, తొగుటలో 4.94, మిరుదొడ్డిలో 4.54, దౌల్తాబాద్‌లో 4.06, రాయిపోల్‌లో 5.75, వర్గల్లో 4.17, ములుగులో 3.50, మర్కూక్‌లో 4.95, జగదేవ్‌పూర్‌లో 5.25, గజ్వేల్‌లో 5.03, కొండపాకలో 5.59, కొమురవెల్లిలో 5.90 సె.మీ, చేర్యాలలో 5.05, మద్దూరులో 6.81, నారాయణరావుపేటలో 8.40, ధూళిమిట్టలో 6.23 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
నల్లవాగు ప్రాజెక్టుకు పెరిగిన వరద
కల్హేర్, సెప్టెంబర్ 7: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 అడుగులు కాగా, మంగళవారం ప్రాజెక్టులో నీటిమట్టం 1493.70 అడుగులకు చేరుకుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 2787 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు
అలుగు పైనుంచి 2767 క్యూసెక్కుల నీరు
దిగువకు వెళ్తున్నది. ఎడమ కాలువ నుంచి 20 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు
కొల్చారం, సెప్టెంబర్ 7: భారీ వర్షాలతో పాటు సింగూరు నుంచి నీటిని వదలడంతో మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నది. మంగళవారం మత్తడి పైనుంచి రెండు ఫీట్ల మేర నీరు ప్రవహించింది. దీంతో జలాలు ఏడుపాయల నీటితో పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్ వైపు వెళ్తున్నాయి.
కూడవెల్లి వాగులో వరద ఉధృతి మత్తడి పోస్తున్న తపాస్‌పల్లి రిజర్వాయర్
కొమురవెల్లి, సెప్టెంబర్ 7 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ ఈసీజన్లో తొలిసారి మంగళవారం మత్తడి దూకింది. రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు విడుదలకు తోడు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తపాస్‌పల్లి రిజర్వాయర్ మత్తడి దుంకుతున్నది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొమురవెల్లి మండల వ్యాప్తంగా 58.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గంగమ్మ.. సల్లంగా సూడమ్మ..
రాయికోడ్, సెప్టెంబర్ 7 : రాయికోడ్ మండలం సీరూర్ గ్రామ శివారులో మంజీర నది వద్ద మంగళవారం సాయంత్రం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గంగమ్మకు పూజలు చేశారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి, పరవళ్లు తొక్కుతుండడం చూసి సంబురపడ్డారు. ‘గంగమ్మ తల్లీ.. సల్లంగా చూడమ్మా’.. అంటూ వేడుకున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.