
సిద్దిపేట/నారాయణరావుపేట, సెప్టెంబర్ 7 : నాలుగు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. నారాయణరావుపేట పెద్ద చెరువు అలుగు పారుతుండడంతో నారాయణరావుపేట నుంచి గుర్రాలగొంది, మల్యాల, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఖాత, ఘణపూర్, అక్కెనపల్లి గ్రామాల నుంచి వెళ్లే దారిలో ఉన్న కాజువే బ్రిడ్జి నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామునిపట్ల, గోనెపల్లి దారిలో బ్రిడ్జి పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచాయి. సిద్దిపేట పట్టణంలోని ఎర్రచెరువు అలుగు పారుతుండడంతో ఎల్లమ్మదేవాలయం నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. కోమటిచెరువుకు వరద పోటెత్తడంతో మత్తడితో పరవళ్లు తొక్కుతుంది.
లోలెవల్ కల్వర్టులపై వరద నీరు
చేర్యాల/మద్దూరు, సెప్టెంబర్ 7 : పట్టణంతోపాటు ఆకునూరు, దొమ్మాట, చిట్యాల, గుర్జకుంట, వేచరేణి, తాడూరు గ్రామాల వా గులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడూరు, కడవేర్గు, చుంచనకోట గ్రా మాల వద్ద ఉన్న లోలెవల్ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేర్యాల మండలంలోని 67 చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి.
మద్దూరు మండలంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో మహేందర్ తెలిపారు. మద్దూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గాగిళ్లాపూర్ పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో రాకపోకలు నిలిచిచాయి. వల్లంపట్ల-ఉప్పరోనిగడ్డ మధ్యలో ఉన్న బీటీ రోడ్డు వర్షాలకు కోతకు గురైంది. వివిధ గ్రామాల్లో పంట చేనులు నీట మునిగాయి. మర్మాముల, మద్దూరులో ఇల్లు కూలాయి.
మత్తళ్లు దుంకుతున్న చెరువులు.. నీట మునిగిన పంటలు
రాయపోల్/మిరుదొడ్డి, సెప్టెంబర్ 7 : రాయపోల్ మండలంలో 57.5మీ.మీ వర్షపాతం నమోదైంది. మండలంలోని 55 చెరువులు, కుంటలు నిండాయి. రాయపోల్‌లోని నల్లచెరువు అలుగు పారుతు న్నది. కొత్తపల్లి గ్రామంలో పత్తి, వరి పంటలు నీటి మునిగాయి.
మిరుదొడ్డి మండలంలోని 75 కుంటలు, 15 చెరువులతోపాటు కూడవెల్లి వాగులో నిర్మించిన 11 చెక్‌డ్యాంలు పూర్తిగా నిండాయి.
గజ్వేల్, సెప్టెంబరు 7 : నియోజకవర్గంలోని 882 చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. గజ్వేల్ మండలంలో 183 చెరువులు అలుగు పారుతున్నాయి. గజ్వేల్‌లోని పాండవుల చెరువు, క్యాసారం కేశవుల చెరువులు, ములుగు మండలంలో కొట్యాల లింగాల చెరువు, చాకలి చెరువు అలుగు పారుతున్నాయి. మర్కూక్ మండలంలో 3 చెక్‌డ్యాంలు, వర్గల్ మండలంలో 17 చెరువులతో పాటు 13 చెక్‌డ్యాంలు అలుగుపారుతున్నాయి. కొండపాక మండలంలోని 176 చెరువుల్లో 90 శాతం నిండాయి. జగదేవ్‌పూర్‌లో 103 చెరువుల్లో 80 శాతానికి పైగా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో పత్తి, మక్కజొన్న పంటలకు నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
హుస్నాబాద్/ హుస్నాబాద్ టౌన్/ బెజ్జంకి, సెప్టెంబర్ 7 : డివిజన్లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా, బస్టాం డ్, మెయిన్‌రోడ్డు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దుకాణాలు, ఇండ్లలోకి వరదనీరు చేరింది. పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు వర్షం తో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇండ్లను పరిశీలించారు. హుస్నాబాద్ మండలంలో 16.15సెం.మీ, అక్కన్నపేటలో 11.05సెం.మీ, కోహెడలో 11.15సెం.మీ, బెజ్జంకి మండలంలో 7.98సెం.మీ వర్షం పడింది. కోహెడ సమీపంలోని వాగులన్నీ పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మోయెతుమ్మెదవాగు ఉధృతి కొనసాగుతున్నది. ఎల్లమ్మ చెరువుకు భారీగా వరద వస్తున్నది. మత్తడిని చూడడానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. మత్తడి ప్రాంతాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న, మాజీఎంపీపీ వెంకట్, కమిషనర్ రాజమల్లయ్య, కౌన్సిలర్ జనగామ రత్నమాల పరిశీలించారు.
బెజ్జంకి మండలంలోని 58 చెరువులు, 12 చెక్‌డ్యాంలు, తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ నిండి అలుగుపారుతున్నాయి. మండల కేంద్రం బెజ్జంకికి వెళ్ల్లే ప్రధాన రోడ్డుపై ఈదుల వాగు, పోతారం, గూడెం కల్వర్టుపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. దాచారం, గాగిల్లాపూర్‌లో ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
పట్టణంలో పర్యటించిన మున్సిపల్‌చైర్‌పర్సన్
పట్టణంలో నీట మునిగిన ప్రాంతాలను మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న పర్యటించారు. ప్రధాన రోడ్డుపై చేరిన నీటిని మున్సిపల్ సిబ్బంది మురుగునీటి కాల్వల్లోకి మళ్లిస్తున్నారు. మెయిన్‌రోడ్డుతోపాటు నాగారం, పోలీస్‌స్టేషన్ ఎదుట దుకాణాల్లోకి వరదనీరు చేర డంతో తడిసిన వస్తువులను మున్సిపల్ చైర్పర్సన్ పరిశీలించి, బాధితులను ఓదార్చారు. ఆమె వెంట వైస్‌చైర్‌పర్సన్ అనిత, కమిషనర్ రాజమల్లయ్య, టీ ఆర్ఎస్ నాయ కుడు అన్వర్, కౌన్సిలర్లు ఉన్నారు.